Chandrababu Naidu: రేపు నెల్లూరు జిల్లాకు సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదే!

Chandrababu Naidu to Visit Nellore District Tomorrow
  • రేపు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
  • విశ్వసముద్ర ఎథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించనున్న సీఎం
  • వెంకటాచలం మండలం ఎడగాలిలో నంద గోకులం లైఫ్ స్కూల్‌కు శ్రీకారం
  • నెల్లూరులో చిరు వ్యాపారుల కోసం స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ప్రారంభం
  • విద్యార్థులతో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి
  • సాయంత్రం తిరిగి విజయవాడకు పయనం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (అక్టోబరు 10) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక, విద్యా, సామాజిక రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

వివరాల్లోకి వెళితే, సీఎం చంద్రబాబు రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు అమరావతి సచివాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు అర్బన్‌లోని మైపాడు గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌ను ప్రారంభిస్తారు. చిరు వ్యాపారుల ప్రయోజనం కోసం 30 కంటైనర్లతో ఆధునికంగా తీర్చిదిద్దిన 120 షాపులను ఆయన పరిశీలిస్తారు.

అనంతరం ముఖ్యమంత్రి వెంకటాచలం మండలం ఎడగాలి గ్రామానికి వెళతారు. అక్కడ నూతనంగా నిర్మించిన నంద గోకులం లైఫ్ స్కూల్‌ను ప్రారంభించి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడికి సమీపంలో ఉన్న గోశాలను సందర్శించి, నంది పవర్ ట్రెడ్‌మిల్ మిషన్‌తో పాటు 'నంద గోకులం సేవ్ ద బుల్' ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత, ఎడగాలిలోనే ఏర్పాటు చేసిన 'విశ్వసముద్ర బయో ఎనర్జీ' ఎథనాల్ ప్లాంట్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని, సాయంత్రం 6:30 గంటలకు సీఎం చంద్రబాబు తిరిగి విజయవాడకు చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Chandrababu Naidu
Nellore district
Andhra Pradesh
Smart Street Vending Market
Nanda Gokulam Life School
Viswasamudra Bio Energy
Ethanol plant
AP CM visit

More Telugu News