Pooran Kumar: ఐజీ హోదాలో ఉన్నా తప్పని కుల వివక్ష.. ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ లేఖలో సంచలన విషయాలు

IPS Pooran Kumar Suicide Letter Alleges Caste Harassment by Senior Officers
  • వెలుగులోకి వచ్చిన సూసైడ్ లెటర్
  • సీనియర్ల వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు లేఖలో వెల్లడి
  • హర్యానా డీజీపీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి భార్య
హర్యానాలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్యకు పాల్పడడంపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉన్నతోద్యోగంలో ఉన్న వ్యక్తి బలవన్మరణానికి పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మృతుడి భార్య ఐఏఎస్ ఆఫీసర్ కావడం, వ్యక్తిగత సమస్యలు కూడా లేకపోవడంతో ఐపీఎస్ ఆఫీసర్ పూరణ్ కుమార్ ఆత్మహత్య మిస్టరీగా మారింది. అయితే, తాజాగా పూరణ్ రాసిన చివరి లేఖ వెలుగులోకి రావడంతో ఈ మిస్టరీ వీడింది. కులం పేరిట వేధింపుల కారణంగానే తాను చనిపోతున్నట్లు పూరణ్ అందులో పేర్కొన్నారు.

సీనియర్ అధికారులు తనను వేధించిన తీరును వివరిస్తూ పూరణ్ కుమార్ 8 పేజీల లేఖ రాశారు. తనను వేధించిన ఉన్నతాధికారుల పేర్లనూ అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ లేఖతో పూరణ్ భార్య, ఐఏఎస్ ఆఫీసర్ అమ్నీత్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్ తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. తన భర్త బలవన్మరణానికి కారణమైన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. వీరితో పాటు హర్యానా పోలీస్ శాఖలో పనిచేస్తున్న 9 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల పేర్లనూ పూరణ్ తన సూసైడ్ లెటర్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

2020 నుంచే ఈ అధికారులు కుల వివక్షతో తనను వేధిస్తున్నారని పూరణ్ ఆరోపించారు. మానసిక వేధింపులు, బహిరంగ అవమానం, దౌర్జన్యాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. ఈ వేధింపులు భరించలేని స్థాయికి చేరడంతో కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయాన్ని సందర్శించినందుకు వేధించారని, చావుబతుకుల మధ్య ఉన్న తన తండ్రిని కడసారి చూసుకోవడానికి సెలవు అడిగితే నిరాకరించారని ఆరోపించారు. తప్పుడు ఆరోపణలతో తనను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పూరణ్ సూసైడ్ లేఖలో చేసిన ఆరోపణలను హర్యానా పోలీస్ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఖండించారు.
Pooran Kumar
Haryana IPS officer
suicide letter
caste discrimination
Satrujeet Kapoor
Amneet
Haryana DGP
Rohtak SP Narendra Bijarnia
police harassment
IPS officers Haryana

More Telugu News