Mohsin Naqvi: ఆసియా కప్ ట్రోఫీపై పెళ్లి వేడుకలో నఖ్వీకి ప్రశ్నలు... షాహీన్ అఫ్రిదీతో కలిసి మౌనంగా వెళ్లిపోయిన నఖ్వీ

Mohsin Naqvi Silent on Asia Cup Trophy Question at Wedding
  • ఆసియా కప్ ట్రోఫీపై కొనసాగుతున్న వివాదం
  • విజేత భారత్‌కు ట్రోఫీనివ్వకుండా తీసుకెళ్లిన ఏసీసీ చీఫ్ నఖ్వీ
  • ట్రోఫీపై మీడియా ప్రశ్నలకు మౌనం వహించిన వైనం
ఆసియా కప్ 2025 ట్రోఫీ ఎక్కడుంది? ఈ ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీని అందజేయకుండా అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పాకిస్థాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ, ఈ వివాదంపై నోరు మెదపడం లేదు. తాజాగా మీడియా అడిగిన ప్రశ్నల నుంచి ఆయన సమాధానం చెప్పకుండా జారుకోవడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది.

గత నెల దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఘన విజయం సాధించింది. అయితే, మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు ట్రోఫీని అందించాల్సిన ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయకుండానే ట్రోఫీ, పతకాలు సహా స్టేడియం నుంచి వెళ్లిపోయారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్న ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వారం కరాచీలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వివాహ వేడుకకు హాజరైన నఖ్వీని మీడియా ప్రతినిధులు ట్రోఫీ గురించి ప్రశ్నించారు. "ఆసియా కప్ ట్రోఫీ భవిష్యత్తు ఏంటి?" అని ఓ విలేకరి అడగ్గా, ఆయన జవాబు చెప్పకుండా మౌనం పాటించారు. అక్కడే ఉన్న పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది, నఖ్వీని మీడియా నుంచి తప్పించి ఆయన కారు వద్దకు తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరోవైపు, ఈ ఘటనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఏసీసీ చీఫ్‌గా తన బాధ్యతలను, కనీస మర్యాదలను నఖ్వీ ఉల్లంఘించారని మండిపడుతోంది. ఈ విషయాన్ని రాబోయే నవంబర్ ఐసీసీ సమావేశంలో ప్రస్తావించాలని బీసీసీఐ నిర్ణయించింది. అంతేకాకుండా, ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి, పదవి నుంచి తొలగించాలని కూడా బీసీసీఐ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వద్ద ఉన్నట్లు సమాచారం. అయితే, దానిని భారత్‌కు ఎప్పుడు, ఎలా అప్పగిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 
Mohsin Naqvi
Asia Cup 2025
Asia Cup Trophy
ACC Chief
BCCI
Pakistan Cricket
Shaheen Afridi
Abrar Ahmed
Suryakumar Yadav
Emirates Cricket Board

More Telugu News