Coldrif Cough Syrup: కల్తీ దగ్గు మందు కల్లోలం.. 22కి చేరిన చిన్నారుల మరణాలు

Toxic cough syrup claims another life in Nagpur hospital toll rises to 22
  • మధ్యప్రదేశ్‌లో కల్తీ దగ్గు మందుతో తీవ్ర విషాదం
  • మృతుల సంఖ్య 22కి చేరినట్లు అధికారిక ప్రకటన
  • సిరప్‌లో విషపూరిత డైథిలిన్ గ్లైకాల్ గుర్తింపు
  • తమిళనాడుకు చెందిన ఫార్మా కంపెనీ యజమాని అరెస్ట్
  • అధికారులపై వేటు వేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో కల్తీ దగ్గు మందు సృష్టిస్తున్న విషాదం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మరో చిన్నారి చ‌నిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరింది. ఖాజ్రీ అంటు గ్రామానికి చెందిన అయిదేళ్ల మయాంక్ సూర్యవంశీ, నాగ్‍పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. కిడ్నీలు పూర్తిగా విఫలం కావడమే మృతికి కారణమని వైద్యులు తెలిపారు.

తమిళనాడుకు చెందిన శ్రీశన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన 'కోల్డ్రిఫ్' అనే దగ్గు మందు తాగడం వల్లే మయాంక్ మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ సిరప్‌లో ప్రమాదకరమైన పారిశ్రామిక రసాయనం డైథిలిన్ గ్లైకాల్ (డీఈజీ) ఉన్నట్లు తేలింది. ఇది కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీసి, ప్రాణాలను హరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ దారుణ ఘటనపై సిట్ ఏర్పాటు 
ఈ దారుణ ఘటనపై మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. శ్రీశన్ ఫార్మా కంపెనీ యజమాని రంగనాథన్ గోవిందరాజన్‌ను చెన్నైలో అరెస్ట్ చేశారు. కాంచీపురంలోని మందుల తయారీ యూనిట్‌ను సీజ్ చేశారు. నిందితుడిని ఛింద్వాడాకు తరలించి విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు
ఈ ఘటనతో అప్రమత్తమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్‌ను సస్పెండ్ చేసింది. రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌ను బదిలీ చేసింది. ఛింద్వాడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నరేశ్ గొన్నాడెను కూడా విధుల నుంచి తొలగించారు. మరోవైపు, నిర్లక్ష్యం ఆరోపణలతో వైద్యుడు ప్రవీణ్ సోనీని అరెస్ట్ చేయగా, దీనిని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళనలకు పిలుపునిచ్చింది.

సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు ఈ సిరప్‌ను సూచించినట్లు తెలుస్తోంది. అయితే, ల్యాబ్ పరీక్షల్లో డీఈజీతో పాటు పారాసెటమాల్, క్లోర్‌ఫెనిరమైన్ వంటి నిషేధిత రసాయనాలు కూడా ఉన్నట్లు తేలింది. నాలుగేళ్లలోపు పిల్లలకు ఇలాంటి మందులను నిషేధిస్తూ 2023లోనే కేంద్రం ఆదేశాలు జారీ చేసినా, వాటి అమలులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

నాగ్‍పూర్ ఆసుపత్రుల్లో మరికొందరు చిన్నారులకు చికిత్స
ప్రస్తుతం నాగ్‍పూర్ ఆసుపత్రుల్లో మరికొందరు చిన్నారులు చికిత్స పొందుతుండగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన దేశంలో ఔషధ భద్రత, నియంత్రణ సంస్థల పనితీరుపై తీవ్ర చర్చకు దారితీసింది.
Coldrif Cough Syrup
Madhya Pradesh
children deaths
diethylene glycol
Srisan Pharma
Nagpur hospital
drug inspector suspended
cough syrup tragedy
Ranganathan Govindarajan
Chhindwara

More Telugu News