Telangana Villages: తెలంగాణలోని ఆ 8 గ్రామాలకు కేంద్రం బంపరాఫర్.. కోటి రూపాయలు గెలిచే అవకాశం!

Central Govt Select 8 Villages From Mulugu For Pm Surya Ghar Model Solar Village And Announces Rs 1 Cr Grant
  • ములుగు జిల్లాలోని 8 గ్రామాలకు కేంద్రం బంపరాఫర్
  • అత్యధిక సోలార్ ప్యానెళ్లు పెట్టిన గ్రామానికి రూ.కోటి బహుమతి
  • 'మోడల్ సోలార్ విలేజ్' పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక
  • పీఎం సూర్య ఘర్ యోజనలో భాగంగా అమలు
  • సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం భారీ సబ్సిడీ
తెలంగాణలోని 8 గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఓ బంపరాఫర్‌ను ప్రకటించింది. ఏకంగా కోటి రూపాయల బహుమతిని గెలుచుకునే అద్భుత అవకాశాన్ని కల్పించింది. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన 'మోడల్ సోలార్ విలేజ్' పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ములుగు జిల్లాలోని ఎనిమిది గ్రామాలను కేంద్రం ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో అత్యధికంగా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్న గ్రామానికి ఈ భారీ నజరానా దక్కనుంది.

దేశవ్యాప్తంగా కరెంటు వాడకం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 'ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. తెలంగాణలో రెడ్కో (తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. దీని కింద పైలట్ ప్రాజెక్ట్‌గా ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండల కేంద్రాలతో పాటు పస్రా, చల్వాయి, మంగపేట, ఏటూరునాగారం, వెంటాపురం గ్రామాలను ఎంపిక చేశారు.

గతేడాది మే నెలలో ఈ పథకంపై అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఫలితంగా, జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 400కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలను ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం పరిగణనలోకి తీసుకుంది.

ఈ పథకం కింద సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ కూడా అందిస్తోంది. ఒక కిలోవాట్ ప్యానెల్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు రూ.78 వేల వరకు రాయితీ లభిస్తుంది. ప్యానెల్ ఏర్పాటుకు ఇంటిపై కనీసం 300 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆసక్తి ఉన్న వినియోగదారులు `pmsuryaghar.gov.in` పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత రెడ్కో, విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి యూనిట్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తారు.
Telangana Villages
Model Solar Village
Solar Power
PM Surya Ghar Muft Bijli Yojana
Redco Telangana
Renewable Energy
Solar Panels Subsidy
Mulugu District

More Telugu News