BRS Leaders House Arrest: 'చలో బస్‌భవన్‌' ఉద్రిక్తం... కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ కీలక నేతల గృహనిర్బంధం

Telangana bus fare hike BRS leaders placed under house arrest ahead of protest
  • బస్సు చార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ 'చలో బస్‌భవన్‌' పిలుపు
  • కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసులు
  • కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు ముఖ్య నేతల హౌస్ అరెస్ట్
  • పలువురు మాజీ కార్పొరేటర్లు, స్థానిక నేతల ముందస్తు అరెస్టులు
  • బస్‌భవన్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత, భారీగా బారికేడ్లు
  • నిరసనకారులు రాకుండా పటిష్ఠమైన పోలీసుల బందోబస్తు
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గురువారం తలపెట్టిన ‘చలో బస్‌భవన్‌’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు కీలక నేతలను గృహనిర్బంధం చేశారు. దీంతో నిరసన కార్యక్రమం ప్రారంభం కాకముందే ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పెంచిన బస్సు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి బస్‌భవన్‌కు చేరుకోవాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయాన్నే కేటీఆర్, కోకాపేటలోని హరీశ్‌రావు నివాసాల వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు, వారిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా వారి నివాసాలకే పరిమితం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా కూడా పోలీసులు బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక మంది మాజీ కార్పొరేటర్లు, మేయర్లు, ఇతర స్థానిక నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు.

మరోవైపు బీఆర్ఎస్ నిరసన పిలుపు నేపథ్యంలో బస్‌భవన్‌ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 500 మంది సిబ్బందిని మోహరించి, బస్‌భవన్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. పోలీసుల చర్యలతో బీఆర్ఎస్ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ఆరంభంలోనే ఆటంకం ఎదురైంది.
BRS Leaders House Arrest
KTR
K Taraka Rama Rao
Harish Rao
BRS Protest
Bus Bhavan
RTC Bus Fares Hike
Telangana Politics
Sabitha Indra Reddy
Talasani Srinivas Yadav
Hyderabad News

More Telugu News