China: నడుము నొప్పికి నాటు వైద్యం.. 8 బతికున్న కప్పలను మింగేసిన బామ్మ.. చివ‌రికి

Chinese Woman Swallows 8 Live Frogs To Treat Lower Back Pain This Happens Next
  • నడుము నొప్పి నివారణకు ఓ వృద్ధురాలి వింత ప్రయత్నం
  • ఎవరో చెప్పారని 8 సజీవ కప్పలను మింగేసిన బామ్మ‌
  • తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిక
  • శరీరంలోకి చేరిన స్పార్గానమ్ అనే పరాన్నజీవులు
  • దెబ్బతిన్న జీర్ణవ్యవస్థ.. రెండు వారాల పాటు చికిత్స
నడుము నొప్పిని తగ్గించుకోవడానికి ఓ వృద్ధురాలు చేసిన పని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఎవరో చెప్పిన మూఢనమ్మకాన్ని విశ్వసించి, ఏకంగా ఎనిమిది బతికున్న చిన్న కప్పలను మింగేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ వింత ఘటన చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, 82 ఏళ్ల జాంగ్ అనే మహిళ చాలాకాలంగా హెర్నియేటెడ్ డిస్క్ సమస్యతో బాధపడుతోంది. తీవ్రమైన నడుము నొప్పితో ఆమె ఇబ్బంది పడుతుండగా, బతికున్న కప్పలను మింగితే నొప్పి మాయమవుతుందని ఎవరో ఆమెకు చెప్పారు. ఈ మాటలు గుడ్డిగా నమ్మిన ఆమె, కొన్ని చిన్న కప్పలను పట్టివ్వమని తన కుటుంబ సభ్యులను కోరింది. వారు తెచ్చివ్వగానే, వాటిని సజీవంగా మింగేసింది.

అయితే, నొప్పి తగ్గకపోగా ఆమె పరిస్థితి మరింత దిగజారింది. తీవ్రమైన కడుపునొప్పి రావడంతో నడవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హాంగ్‌జౌలోని ఓ ఆసుపత్రికి తరలించారు. "మా అమ్మ 8 బతికున్న కప్పలను మింగింది. ఇప్పుడు తీవ్రమైన నొప్పితో నడవలేకపోతోంది" అని ఆమె కుమారుడు వైద్యులకు వివరించాడు.

వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా, శరీరంలో ఆక్సిఫిల్ కణాల సంఖ్య అసాధారణంగా పెరిగినట్లు గుర్తించారు. పరాన్నజీవుల ఇన్ఫెక్షన్ లేదా రక్త సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని వారు తెలిపారు. మరిన్ని లోతైన పరీక్షల్లో ఆమె జీర్ణవ్యవస్థ దెబ్బతిన్నట్లు, స్పార్గానమ్ వంటి ప్రమాదకరమైన పరాన్నజీవులు ఆమె శరీరంలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు. 

"కప్పలను సజీవంగా మింగడం వల్ల పేషెంట్ జీర్ణవ్యవస్థ దెబ్బతింది. ప్రమాదకరమైన పరాన్నజీవులు ఆమె శరీరంలోకి చేరాయి" అని వైద్యులు తెలిపారు. అనంతరం రెండు వారాల పాటు చికిత్స అందించగా, ఆమె కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. శాస్త్రీయ ఆధారం లేని ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలతో చెలగాటమాడవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
China
Zhang
back pain remedy
live frogs
Zhejiang province
herniated disc
parasitic infection
superstition
traditional medicine

More Telugu News