CRDA Office: అమరావతి పనుల్లో కీలక ముందడుగు.. సిద్ధమైన సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం

CRDA Office Ready in Amaravati
  • ఈనెల 13న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
  • దాదాపు ఆరేళ్లుగా ఆగిపోయిన నిర్మాణ పనులు
  • కూటమి ప్రభుత్వం వచ్చాక 8 నెలల్లోనే పూర్తి
  • రూ. 257 కోట్లతో ఏడంతస్తుల్లో భారీ భవనం
  • విజయవాడ నుంచి అమరావతికి మారనున్న కార్యకలాపాలు
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన అనంతరం దాదాపు ఆరేళ్ల పాటు నిలిచిపోయిన అభివృద్ధి పనులకు ఊతమిస్తూ, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కోసం నిర్మించిన నూతన భవనం ప్రారంభానికి ముస్తాబైంది. ఈ నెల 13వ తేదీ ఉదయం 9:54 గంటలకు సీఎం చంద్రబాబు ఈ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో ఈ భవన నిర్మాణాన్ని కేవలం 8 నెలల వ్యవధిలోనే పూర్తి చేయడం విశేషం.

ప్రస్తుతం విజయవాడ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీఆర్డీఏ కార్యాలయం ఇకపై పూర్తిస్థాయిలో అమరావతి నుంచే పనిచేయనుంది. రూ. 257 కోట్ల వ్యయంతో, 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+7 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించారు. గత 8 నెలలుగా 500 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు రేయింబవళ్లు శ్రమించి దీనిని పూర్తి చేశారు. ఈ నూతన కార్యాలయంలో పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీఏ కమిషనర్ల ఛాంబర్లతో పాటు పరిపాలన, ఇంజనీరింగ్, ప్రణాళికా విభాగాలు, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

రాజధానిలోని లింగాయపాలెం సరిహద్దుల్లో, కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు, ఎన్ 11 రోడ్ల కూడలిలో మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో ప్రధాన భవనంతో పాటు పచ్చదనం, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. 176 కార్లు, 176 ద్విచక్ర వాహనాలు పార్క్ చేసేలా ఏర్పాట్లు చేశారు. పర్యావరణ హితంగా నిర్మించిన ఈ భవనానికి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ కూడా లభించింది. దీనివల్ల 44 శాతం విద్యుత్, 66 శాతం నీరు ఆదా అవుతాయని అంచనా. భవనం పైఅంతస్తులో ఉద్యోగుల కోసం జిమ్, క్యాంటీన్ వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు.
CRDA Office
Chandrababu
Amaravati
CRDA
Andhra Pradesh
Capital City
Building Inauguration
Seed Axis Road
Lingayapalem
AP CRDA
Green Building

More Telugu News