MK Stalin: గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమంపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: తమిళనాడు సీఎం స్టాలిన్

MK Stalin urges central intervention in Gaza Israel conflict
  • గాజాకు అనుకూలంగా చెన్నైలో నిర్వహించిన నిరసనలో పాల్గొన్న ముఖ్యమంత్రి
  • ఇజ్రాయెల్ విచక్షణారహిత దాడులను కేంద్రం ఖండించాలని డిమాండ్
  • గాజాపై దాడులను ఖండిస్తూ అక్టోబర్ 14న అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వెల్లడి
గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అన్నారు. గాజాకు మద్దతుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇజ్రాయెల్ దాడులను ఆపేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ విచక్షణారహిత దాడులను కేంద్రం ఖండించాలని ఆయన కోరారు.

గాజాలో శాంతి నెలకొల్పడానికి, మానవతా సహాయం అందించడానికి ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం దౌత్య ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు అక్టోబర్ 14న తమిళనాడు అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తామని స్టాలిన్ ప్రకటించారు. ఈ తీర్మానం తమిళనాడు ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తుందని, కాబట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మద్దతు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు తమను మాత్రమే కాకుండా, ప్రపంచాన్ని కదిలించాయని ఆయన అన్నారు. ఈ దాడులను, అన్యాయాన్ని ఖండించకుండా ఉండలేమని స్పష్టం చేశారు. తాము చేపట్టేది రాజకీయ నిరసన కాదని, మానవతావాద నిరసన అని స్టాలిన్ పేర్కొన్నారు. గాజాలో గత ఏడాది కాలంలో 50 వేల మంది వరకు ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి, యూనిసెఫ్ నివేదికలను ఉటంకిస్తూ తెలిపారు. మరణించిన వారిలో 26 వేల మంది చిన్నారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముస్లింలను ప్రసన్నం చేసుకునే రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలపై డీఎంకే స్పందించింది. డీఎంకే ఎల్లప్పుడూ అణిచివేతకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా అన్నారు. శ్రీలంక తమిళుల కోసమైనా, పాలస్తీనా కోసమైనా అణిచివేతకు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
MK Stalin
Gaza
Israel
Tamil Nadu
Palestine
DMK
Central Government
UNICEF
United Nations

More Telugu News