Jamieson Greer: రష్యా చమురు భారత ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడూ ఆధారం కాదు.. అందుకే ట్రంప్ అధిక టారిఫ్ విధించారు: ట్రంప్ సలహాదారు

Jamieson Greer says Russian oil not the base for Indian economy
  • న్యూయార్క్‌లో జరిగిన ది ఎకనమిక్ క్లబ్‌లో మాట్లాడిన జెమీసన్ గ్రీర్
  • రష్యా-భారత్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయన్న జెమీసన్ గ్రీర్
  • గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్కో నుంచి భారత్ చమురు కొంటుందన్న గ్రీర్
రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు భారత ఆర్థిక వ్యవస్థకు ఎప్పటికీ మూలస్తంభం కాబోదని అమెరికా వాణిజ్య ప్రతినిధి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు జెమీసన్ గ్రీర్ అన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ది ఎకనమిక్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ, రష్యా-భారత్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ, గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్కో నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తోందని తెలిపారు.

రష్యా రాయితీ ధరకు చమురును విక్రయిస్తుండటంతో గత రెండు, మూడు సంవత్సరాలుగా భారత్ అధికంగా కొనుగోలు చేస్తోందని ఆయన అన్నారు. అయితే, ఢిల్లీ ఈ చమురును కేవలం దేశీయ అవసరాల కోసం మాత్రమే కాకుండా, శుద్ధి చేసి ఇతర దేశాలకు విక్రయిస్తోందని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోళ్లు ఒక్కటే భారత్‌కు బలమైన ఆర్థిక ఆధారమని భావించలేమని, అందుకే ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు చేయాలని సూచిస్తున్నామని తెలిపారు.

తమ ఉద్దేశాన్ని భారత్ అర్థం చేసుకోవాలని జెమీసన్ గ్రీర్ అన్నారు. ఈ విషయంలో భారత్ వైవిధ్యభరితమైన చర్యలు ప్రారంభించిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ సార్వభౌమ దేశమని, సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉందని ఆయన అన్నారు. ఏ దేశంతో సంబంధాలు కొనసాగించాలి, ఏ దేశంతో తెంచుకోవాలో తాము చెప్పదలుచుకోలేదని, ఈ విషయంలో అమెరికా ఎవరినీ శాసించదని స్పష్టం చేశారు.

భారత్‌పై ట్రంప్ విధించిన అధిక సుంకాలపై కూడా జెమీసన్ గ్రీర్ స్పందించారు. అమెరికాతో వాణిజ్యం వల్ల భారత్‌కు 40 బిలియన్ డాలర్లకు పైగా మిగులు ఉంటోందని తెలిపారు. తాము భారత్‌కు విక్రయించే దానికంటే, భారత్ తమకు విక్రయించే ఉత్పత్తులే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధానికి పుతిన్‌కు న్యూఢిల్లీ వనరులు అందిస్తున్నట్లు అవుతోందని అభిప్రాయపడ్డారు. మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్‌పై ఈ స్థాయిలో సుంకాలు విధించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
Jamieson Greer
Donald Trump
India Russia relations
India oil imports
Russian oil
Indian economy

More Telugu News