Vangaveeti Radha: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం.. ఒకే ఫ్రేమ్‌లో కొడాలి నాని, వంశీ, వంగవీటి రాధా

Kodali Nani Vallabhaneni Vamsi attend Vangaveeti Radha daughter function
  • వంగవీటి రాధా కుమార్తె ఉయ్యాల వేడుక
  • హాజరైన కొడాలి నాని, వల్లభనేని వంశీ
  • ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ముగ్గురు నేతలు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
  • రాజకీయాలకు అతీతంగా కొనసాగుతున్న స్నేహంపై చర్చ
రాజకీయంగా భిన్న ధ్రువాల్లో ఉన్నప్పటికీ, తమ స్నేహబంధం చెక్కుచెదరలేదని మరోసారి చాటుకున్నారు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. చాలా కాలం తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఈ ముగ్గురు నేతలు ఒకే వేదికపై కనిపించడంతో, ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే... వంగవీటి రాధా దంపతులకు ఇటీవల కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. పాపకు రుధిర అని నామకరణం చేశారు. సోమవారం రాత్రి చిన్నారి ఉయ్యాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాధా ఆహ్వానం మేరకు కొడాలి నాని, వల్లభనేని వంశీ, జక్కంపూడి రాజా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారంతా చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రాధా, నాని, వంశీ ముగ్గురూ కలిసి దిగిన ఫొటో రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

ప్రస్తుతం రాధా తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతుదారుగా ఉండగా, కొడాలి నాని, వల్లభనేని వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. రాజకీయంగా తీవ్రమైన విమర్శలు చేసుకునే ఈ పార్టీలకు చెందిన నేతలు ఇలా ఒకేచోట కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలు వేరైనా వారి మధ్య స్నేహం చెక్కుచెదరలేదని, "రాజకీయాలు వేరు, స్నేహం వేరు" అంటూ నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్లు చేస్తున్నారు.

వంగవీటి రాధా 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైఎస్సార్‌సీపీలలో పనిచేసి 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఆయన కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. తాజా పరిణామంతో ఈ ముగ్గురు నేతల స్నేహం మరోసారి వార్తల్లో నిలిచింది.
Vangaveeti Radha
Vangaveeti Radha daughter
Kodali Nani
Vallabhaneni Vamsi
Krishna district politics
Andhra Pradesh politics
TDP
YSRCP
friendship

More Telugu News