ED Raids: లగ్జరీ కార్ల స్కామ్.. మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌ ఇళ్లలో ఈడీ సోదాలు

Mammootty and Dulquer Salmaan Homes Raided in Luxury Car Scam
  • మలయాళ స్టార్ హీరోల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు
  • భూటాన్ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో కొనసాగుతున్న సోదాలు
  • మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ ఇళ్లలో తనిఖీలు
  • ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ విచారణ
  • నకిలీ పత్రాలతో కార్ల రిజిస్ట్రేషన్ ఆరోపణలు
  • కేరళ, తమిళనాడులో 17 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
భూటాన్ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కుంభకోణం కేసు మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్రముఖ నటులు మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చక్కలక్కల్‌ నివాసాలతో పాటు మొత్తం 17 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై ఈడీ ఈ చర్యలు చేపట్టింది. భూటాన్, నేపాల్ మార్గాల ద్వారా టయోటా ల్యాండ్ క్రూయిజర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి ఖరీదైన వాహనాలను అక్రమంగా దిగుమతి చేస్తున్న ఓ ముఠాపై తమకు కచ్చితమైన సమాచారం అందిందని ఈడీ అధికారులు తెలిపారు. ఈ ముఠా భారత సైన్యం, అమెరికా రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అక్రమంగా వాహన రిజిస్ట్రేషన్లు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఈ కార్లను సినీ ప్రముఖులతో సహా పలువురికి తక్కువ ధరకు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి.

'ఆపరేషన్ నుమ్‌ఖోరు' కింద కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న తన కారును విడుదల చేయాలని కోరుతూ దుల్కర్ సల్మాన్ కేరళ హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతి పొందిన మరుసటి రోజే ఈడీ దాడులు జరగడం గమనార్హం. దుల్కర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఆ కారును 2004లో రెడ్ క్రాస్ కోసం చట్టబద్ధంగా దిగుమతి చేశారని, ఆ తర్వాత తాము కొనుగోలు చేశామని కోర్టుకు తెలిపారు. అయితే, కేసు విచారణ కొనసాగుతున్నందున కారును సీజ్ చేసే హక్కు తమకుందని కస్టమ్స్ అధికారులు వాదించారు.

కేరళలో ఇలాంటి అక్రమ దిగుమతి కార్లు 150కి పైగా ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 40 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుందని, మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ED Raids
Mammootty
Dulquer Salmaan
luxury car scam
Enforcement Directorate
Bhutan car smuggling
Malayalam film industry
Prithviraj Sukumaran
Amit Chakkalakkel
FEMA violations

More Telugu News