Sammakka Sarakka: సమ్మక్క-సారక్క యూనివర్సిటీ లోగో ఇదే!

Sammakka Sarakka University Logo Unveiled
  • సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం లోగోను ఆవిష్కరించిన కేంద్ర మంత్రులు
  • విశ్వవిద్యాలయం ఏర్పాటు సంతోషదాయకమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని గిరిజనులకు ఇది విద్యా కేంద్రంగా నిలవనుందన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్
తెలంగాణ గిరిజన సంప్రదాయాలకు నూతన ఒరవడి తెచ్చేలా సమ్మక్క-సారక్క పేరుతో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్థాపన కల నిజమవుతోంది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జి. కిషన్‌రెడ్డి న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా వారి పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించినట్లు వెల్లడించిన ఆయన, భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరినట్టు తెలిపారు.
ఈ విశ్వవిద్యాలయ స్థాపనలో సహకరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
 
రూ.800 కోట్ల కేటాయింపు – భవిష్యత్తు లక్ష్యాలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. “ఈ విశ్వవిద్యాలయం ప్రధాని మోదీ దూరదృష్టి, కిషన్‌రెడ్డి చొరవతో ప్రారంభమైంది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా నిధులు కేటాయించాం. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని గిరిజనులకు ఇది విద్యా కేంద్రంగా నిలవనుంది” అని పేర్కొన్నారు.
 
విశ్వవిద్యాలయం స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త కోర్సులు అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆయుర్వేదం, గిరిజన ఆహార శైలి, భాషలు, సంప్రదాయాలకు అనుగుణంగా కోర్సులు ఉండాలని సూచించారు. గిరిజన భాషల్లో బోధన, క్రీడా నైపుణ్యాల ప్రోత్సాహం, సృజనాత్మక పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
 
సృజనాత్మక లోగో – గిరిజన భాషలకు గుర్తింపు

విశ్వవిద్యాలయానికి రూపకల్పన చేసిన లోగోలో పలు తెగల భాషల పదాలు వాడడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అంశాన్ని హైలైట్ చేసిన ప్రధాన్.. ఇది సృజనాత్మకతతో కూడిన అద్భుతమైన నిర్ణయమని ప్రశంసించారు.


Sammakka Sarakka
Sammakka Sarakka University
Tribal University
Dharmendra Pradhan
G Kishan Reddy
Telangana
Tribal Culture
Central University
Tribal Languages
Narendra Modi

More Telugu News