Mohanlal: మరో విశిష్ట గౌరవం అందుకున్న మోహన్ లాల్... ఈసారి ఆర్మీ నుంచి!

Mohanlal Receives Special Honor from Indian Army
  • ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌కు భారత ఆర్మీ చీఫ్ సత్కారం
  • జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా 'కమెండేషన్ కార్డ్'
  • దేశ నిర్మాణంలో సైన్యానికి మద్దతిస్తున్నందుకు ప్రశంస
  • మానవతా సాయంలో ఆర్మీ పాత్రపై అవగాహన కల్పించడంలో కృషి
  • యువత సైన్యంలో చేరేలా స్ఫూర్తి నింపుతున్నారని కొనియాడిన ఆర్మీ
భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరైన మోహన్‌లాల్‌కు సైన్యం నుంచి అరుదైన గౌరవం లభించింది. సమాజానికి ఆయన అందిస్తున్న విశిష్ట సేవలు, సాయుధ దళాలతో కొనసాగిస్తున్న అనుబంధాన్ని గుర్తిస్తూ భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆయన్ను ప్రత్యేకంగా సత్కరించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్‌కు 'చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డ్'ను అందజేశారు.

ఆయనలోని సేవా స్ఫూర్తి, దాతృత్వం, సైన్యం పట్ల చూపిస్తున్న అపారమైన గౌరవానికి చిహ్నంగా ఈ ప్రశంసాపత్రాన్ని అందజేసినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. మోహన్ లాల్ కు విశిష్ట పురస్కారంపై ఆర్మీ ఓ ప్రకటన చేసింది.

దేశ నిర్మాణ కార్యక్రమాలలో, సైన్యం చేపట్టే మానవతా సహాయక చర్యలలో మోహన్‌లాల్ నిరంతరం అందిస్తున్న మద్దతుకు గుర్తింపుగా ఈ గౌరవం అందిస్తున్నట్టు సైన్యం వెల్లడించింది.

సాయుధ దళాలకు మోహన్‌లాల్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని ప్రశంసించింది. ముఖ్యంగా, సైనికులను గౌరవించే కార్యక్రమాలలో ఆయన చురుకుగా పాల్గొనడం, యువత సైన్యంలో చేరేలా స్ఫూర్తి నింపడం, సమాజంలో సైన్యం పాత్రపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను ఆర్మీ ప్రత్యేకంగా కొనియాడింది.

మోహన్‌లాల్ వంటి ప్రముఖులు సైన్యానికి మద్దతుగా నిలవడం వల్ల సాయుధ దళాలకు, పౌరులకు మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఈ సందర్భంగా ఆర్మీ పేర్కొంది. ‘సేవ... దేశ ప్రథమ కర్తవ్యం’ అనే స్ఫూర్తిని మోహన్‌లాల్ తన చర్యల ద్వారా ప్రతిబింబిస్తున్నారని అభిప్రాయపడింది. ఈ సత్కారం ద్వారా ఆయన నిబద్ధతకు తగిన గౌరవం ప్రకటిస్తున్నామని సైన్యం వివరించింది.

మోహన్‌లాల్ కేవలం నటుడిగానే కాకుండా భారత టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో కూడా ఉన్నారు. 2009 మే నెలలో ఆయనకు ఈ గౌరవం దక్కింది. అప్పటి నుంచి ఆయన సైన్యంతో లోతైన సంబంధాన్ని కొనసాగిస్తూ, దేశ సేవ, క్రమశిక్షణ, జాతీయ భావం వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తున్నారు. ముఖ్యంగా, 2024 ఆగస్టులో కేరళలోని వాయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విపత్తు సమయంలో ఆయన స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొని తన సేవాభావాన్ని చాటుకున్నారు.

విశ్వశాంతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మోహన్‌లాల్ దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో ఆయన ఫౌండేషన్ అలుపెరగని కృషి చేస్తోంది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఆయన కళాసేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ (2001), పద్మభూషణ్ (2019) పురస్కారాలతో సత్కరించింది. ఇటీవలే ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఆయన అందుకున్నారు. 
Mohanlal
Indian Army
Chief of Army Staff Commendation Card
General Upendra Dwivedi
Territorial Army
Padma Bhushan
Dadasaheb Phalke Award
Vishwasanthi Foundation
Humanitarian Service

More Telugu News