Kavitha: మీరు ఉద్యమాలు చేయలేరని నాకు తెలుసు... మీ తరఫున నేను కొట్లాడుతా: కవిత

Kavitha Fights for Unemployed Youth Regarding Group 1 Issues
  • గ్రూప్-1 నోటిఫికేషన్ నుంచి ఫలితాల వరకు ప్రభుత్వం అనేక తప్పులు చేసిందన్న కవిత
  • సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్
  • ఇతర ఉద్యోగాలు, వ్యాపకాల్లో ఉన్నందున మీరు పోరాడలేరని నాకు తెలుసు అన్న కవిత
  • నేను, తెలంగాణ జాగృతి పోరాడుతుందని హామీ
  • వీడియో విడుదల చేసిన కవిత
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అనేక తప్పిదాలు చేసిందని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను సైతం తుంగలో తొక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. గ్రూప్-1 నియామకాల్లో ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేశారు.

"నిరుద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. ఉద్యమాలు చేయడానికి మీకు వీలుకాదని నాకు తెలుసు. మీరు బయటకు రాలేరు. మీరు వివిధ ఉద్యోగాల్లో, ఇతర వ్యాపకాల్లో ఉండటం వలన బయటకు రాలేరు. కాబట్టి మీ తరఫున నేను, తెలంగాణ జాగృతి పోరాడుతుంది" అని ఆమె అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ప్రత్యేకించి నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరిగా లేదని ఆమె విమర్శించారు. గ్రూప్-1కు సంబంధించి ఇచ్చిన అపాయింట్‌మెంట్ లెటర్లను రద్దు చేసి, తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో పెట్టుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రిలిమినరీ పరీక్ష నుంచి ఫలితాల వరకు ఎన్నో తప్పులు జరిగాయని, ప్రభుత్వం తరఫు న్యాయవాదులే కోర్టులలో భిన్నమైన వాదనలు వినిపించారని ఆమె ఆరోపించారు.

నిరుద్యోగ యువతపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదా అని ఆమె రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. గ్రూప్-1 ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసినా, వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆమె గుర్తు చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

గ్రూప్-1 అంశంపై న్యాయస్థానం తీర్పు వెలువరించిన తర్వాతనే అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను డిస్పోజ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. పరీక్షలను తిరిగి నిర్వహించే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని కవిత వెల్లడించారు. 
Kavitha
Kalvakuntla Kavitha
Telangana Group 1
Group 1 Notification
Telangana Jagruthi
Revanth Reddy

More Telugu News