Jagan: జగన్ రోడ్డు ప్రయాణానికి బ్రేక్.. హెలికాప్టర్‌కు మాత్రమే అనుమతి!

Jagans Road Trip Halted Helicopter Only Allowed
  • ఈనెల 9న అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
  • మాకవరపాలెంకు రోడ్డు మార్గంలో వచ్చేందుకు అనుమతి నిరాకరణ
  • తమిళనాడులో తొక్కిసలాట ఘటనను ప్రస్తావించిన అధికారులు
వైసీపీ అధినేత జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనకు సంబంధించి పోలీసులు కీలక సూచనలు చేశారు. ప్రజాభద్రత, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు అనుమతి నిరాకరించారు. కేవలం హెలికాప్టర్‌లో మాత్రమే పర్యటనకు రావాలని స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే, జగన్ ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలోని మాకవరపాలెంలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటన కోసం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మాకవరపాలెం వరకు సుమారు 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు వైసీపీ నేతలు పోలీసుల అనుమతి కోరారు. అయితే ఈ దరఖాస్తును జిల్లా పోలీసులు తిరస్కరించారు.

ఈ విషయంపై అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ కుమార్ మీడియాకు వివరణ ఇచ్చారు. జగన్ రోడ్డు ప్రయాణ మార్గంలోని ప్రధాన కూడళ్ల వద్ద భారీగా జనసమీకరణ చేసి, ప్రదర్శనలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగిందని, అలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూసే బాధ్యత తమపై ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కారణాల వల్లే రోడ్డు మార్గంలో ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదని, అందుకు ప్రత్యామ్నాయంగా హెలికాప్టర్‌లో మాకవరపాలెం చేరుకోవాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు జగన్ హెలికాప్టర్ పర్యటనకు అవసరమైన అనుమతులు మంజూరు చేసినట్లు తుహిన్ కుమార్ స్పష్టం చేశారు. 
Jagan
YS Jagan
YS Jagan Mohan Reddy
Anakapalle
Makavarapalem
Andhra Pradesh
Roadshow
Helicopter
Police Permission
YSRCP

More Telugu News