Aon plc: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి.. భారత్‌లో మాత్రం 9 శాతం వేతనాల పెంపు!: అంతర్జాతీయ సంస్థ నివేదిక

Aon Report India Salary Hike Expected to be 9 Percent in 2026
  • అయోన్-పీఎల్సీ కీలక నివేదిక
  • రియాల్టీ, మౌలిక సదుపాయాలు, ఎన్బీఎఫ్‌సీ రంగాల్లో అధిక వేతన పెంపు ఉండే అవకాశం
  • బలమైన వినియోగం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, ప్రభుత్వ విధానాల బాసట
2026లో భారతదేశంలో వేతనాలు సగటున 9 శాతం పెరగవచ్చని ఒక నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా మందగమనం ఉన్నప్పటికీ భారత మార్కెట్ సానుకూలంగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రముఖ అంతర్జాతీయ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయోన్-పీఎల్సీ (Aon plc) మంగళవారం విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.

ప్రధానంగా రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, ఎన్బీఎఫ్‌సీ రంగాల్లో వేతన పెంపు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగంలోని కంపెనీలు 10.9 శాతం, ఎన్బీఎఫ్‌సీలు 10 శాతం వరకు వేతనాలు పెంచవచ్చని పేర్కొంది. ఆటోమోటివ్, వాహన తయారీ వంటి పరిశ్రమలు 9.6 శాతం, ఇంజినీరింగ్ డిజైన్ సేవలకు సంబంధించిన సంస్థలు 9.7 శాతం, ఇంజినీరింగ్ మరియు తయారీ రంగ కంపెనీలు 9.2 శాతం, రిటైల్, లైఫ్ సైన్సెస్ సంస్థలు 9.6 శాతం చొప్పున వేతన పెంపును అందించే అవకాశముందని నివేదికలో తెలిపింది.

రసాయన కంపెనీల్లో 8.8 శాతం, ఈ-కామర్స్‌లో 9.2 శాతం, ఎఫ్ఎంసీజీ రంగాల్లో 9.1 శాతం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లలో 9.5 శాతం, టెక్నాలజీ రంగంలోని కంపెనీలు 9.4 శాతం, బ్యాంకింగ్ రంగం 8.6 శాతం, టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ రంగాల్లో 6.8 శాతం చొప్పున వేతనాలు పెంచవచ్చని తెలిపింది.

భారతదేశంలోని బలమైన దేశీయ వినియోగం, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు, ప్రభుత్వ విధానాలు వ్యాపార వృద్ధి, ఉద్యోగ స్థిరత్వానికి బాసటగా నిలుస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది. అయోన్ భాగస్వామి, రివార్డ్ కన్సల్టింగ్ ప్రతినిధి రూపాంక్ చౌదరి మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్, ఎన్బీఎఫ్‌సీ వంటి రంగాలు వేతన పెంపు అంశంలో ముందున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్న కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు.

2025లో ఆట్రిషన్ రేటు క్రమంగా తగ్గినట్లు ఈ నివేదిక తెలిపింది. 2023లో 18.7 శాతం, 2024లో 17.7 శాతంగా ఉన్న ఆట్రిషన్ 2025లో 17.1 శాతానికి తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఇది మరింత స్థిరత్వాన్ని సూచిస్తున్నట్లు తెలిపింది. ఆయా రంగంలోని కంపెనీలు భవిష్యత్తులో ప్రతిభను నిలుపుకోవడంపై, నైపుణ్యాల పెంపు కోసం పెట్టుబడులు పెట్టవచ్చునని తెలిపింది.

అయోన్ అసోసియేట్ భాగస్వామి అమిత్ కుమార్ ఓత్వానీ మాట్లాడుతూ, ఇటీవల పన్ను సవరణలు భారతదేశంలో వ్యాపార వాతావరణాన్ని మార్చివేశాయని, ఈ నిర్ణయాలు వినియోగ ఉత్పత్తులు, ఆటోమోటివ్ రంగాలకు సానుకూలంగా ఉంటుందని అన్నారు.
Aon plc
India salary hike
Aon report
salary increase 2026
India compensation
real estate sector

More Telugu News