Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో ఊరట.. పార్టీ గుర్తుపై ఈసీకి కీలక ఆదేశాలు

Teenmaar Mallanna Gets Relief in High Court Orders to EC on Party Symbol
  • ఇటీవలే తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించిన మల్లన్న
  • స్థానిక ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని వినతి
  • మల్లన్న అభ్యర్థనను పరిశీలించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం
ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన పార్టీ గుర్తింపు, గుర్తుకు సంబంధించిన అభ్యర్థనను పరిశీలించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న మల్లన్నకు ఊరట లభించినట్లయింది.

ఇటీవల తాను స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి గుర్తింపునిచ్చి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుర్తును కేటాయించాలని కోరుతూ తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్ వినతిని పరిగణనలోకి తీసుకుని, నిబంధనల మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.

తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎరుపు, ఆకుపచ్చ రంగుల జెండా మధ్యలో పిడికిలి, కార్మిక చక్రం, వరి కంకులతో పార్టీ పతాకాన్ని రూపొందించారు. ‘ఆత్మగౌరవం, అధికారం, వాటా’ అనే నినాదాలను జెండాపై ముద్రించారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో పార్టీ గుర్తింపు, గుర్తు కేటాయింపునకు గల అవకాశాలను ఎన్నికల సంఘం పరిశీలించనుంది. 
Teenmaar Mallanna
Telangana Rajyadhikara Party
Chintapandu Naveen
Telangana Elections
State Election Commission
Local Body Elections
Party Symbol
High Court Order
BC Politics Telangana

More Telugu News