India vs Pakistan: భారత్-పాక్ మ్యాచ్‌లు ఆపడం సాధ్యమేనా?.. అసలు విషయం చెప్పిన బీసీసీఐ

BCCI on Stopping India Pakistan Cricket Matches The Reality
  • భారత్-పాక్ మ్యాచ్‌ల రద్దు డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ
  • ఈ విషయంపై మాట్లాడటం తేలికేనన్న బీసీసీఐ అధికారి
  • స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్లు ఒప్పుకుంటారా? అని సూటి ప్రశ్న
  • మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ సలహాకు కౌంటర్
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లను నిలిపివేయాలంటూ వస్తున్న డిమాండ్లపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. ఈ విషయంపై మాట్లాడటం తేలికే కానీ, ఆచరణలో ఎన్నో ఆర్థిక సవాళ్లు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్ల ప్రయోజనాలను విస్మరించి నిర్ణయాలు తీసుకోలేమని పరోక్షంగా స్పష్టం చేశారు.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఈ విధంగా స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరిష్కారమయ్యే వరకు ఐసీసీ టోర్నీలలో భారత్-పాక్ మ్యాచ్‌లను తగ్గించాలని, ఇందుకోసం పారదర్శకమైన డ్రా పద్ధతిని అనుసరించాలని అథర్టన్ సూచించారు. "క్రికెట్ ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలకు, ప్రచారానికి వేదికగా మారింది. ఆర్థిక ప్రయోజనాల కోసం టోర్నీల షెడ్యూల్ మార్చడాన్ని సమర్థించలేం" అని ఆయన తన కాలమ్‌లో పేర్కొన్నారు. 

అథర్టన్ సూచనపై స్పందిస్తూ, పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ బీసీసీఐ అధికారి ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. "ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం చాలా సులభం. కానీ స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్లు దీనికి అంగీకరిస్తారా? కేవలం భారత్ అనే కాదు, ఏ పెద్ద జట్టు టోర్నీ నుంచి తప్పుకున్నా స్పాన్సర్లను ఆకర్షించడం కష్టమవుతుంది" అని ఆయన వాస్తవ పరిస్థితిని వివరించారు.

గత నెల 28న ముగిసిన ఆసియా కప్ ఫైనల్ తర్వాత ఈ వివాదం పెద్దదైంది. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్ మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి కూడా టీమిండియా ఇష్టపడలేదు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ వంటి ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. 2013 తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదన్న విషయం తెలిసిందే.
India vs Pakistan
BCCI
India Pakistan cricket match
Michael Atherton
ICC tournaments
Asia Cup
Mohsin Naqvi
Bilateral series
Cricket
Sponsors

More Telugu News