Suryakantham: ఇంట్లో సూర్యకాంతం ఎలా ఉండేవారంటే .. కోడలు ఈశ్వరీ రాణి!

Eshwari Rani Interview
  • చాలా చిన్న వయసులో కోడలిగా వచ్చానన్న ఈశ్వరి రాణి 
  • సూర్యకాంతం గారు తనకి పనులు చెప్పేవారు కాదని వెల్లడి 
  • దగ్గరుండి శ్రద్ధగా వంటలు నేర్పించేవారని వ్యాఖ్య  
  • తనని ఓ కూతురుగా చూసేవారని వివరణ  

సూర్యకాంతం .. వెండితెరపై ఒక వెలుగు వెలిగిన నటీమణి. అప్పట్లో హీరోలలో ఎన్టీఆర్ - ఏఎన్నార్, హీరోయిన్స్ లో సావిత్రి - జమున డేట్స్ దొరకడం కష్టంగా ఉండేది. ఆ సమయంలో అంతకంటే ఎక్కువ బిజీగా ఉన్న కేరక్టర్ ఆర్టిస్టులు ఇద్దరే ఉన్నారు. ఒకరు ఎస్వీఆర్ అయితే, మరొకరు సూర్యకాంతం. గయ్యాళి అత్తగా సూర్యకాంతం వేసిన ముద్ర తిరుగులేనిది. అలాంటి ఆమె నిజజీవితంలో తన కోడలితో ఎలా ఉండేవారో అనే ఒక ఆసక్తి అభిమానులలో ఉండటం సహజం. 

సూర్యకాంతం కోడలు ఈశ్వరీరాణి తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావించారు. సూర్యకాంతం గారి ఇంటికి నేను కోడలిగా వచ్చే సమయానికి నా వయసు 16 ఏళ్లు మాత్రమే. అప్పట్లో 10వ తరగతి పూర్తికాగానే నాకు పెళ్లి చేశారు. సూర్యకాంతం గారు నటించిన సినిమాలన్నీ తప్పకుండా చూసేదానిని. తెరపై అత్తగా చాలా గయ్యాళీగా నటించారు గానీ, ఇంట్లో నాతో ఎంతో మంచిగా ఉండేవారు. ప్రేమగా .. ఆప్యాయంగా చూసుకునేవారు" అని అన్నారు. 

" సూర్యకాంతం గారికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. నేను చిన్నపిల్లను కావడం వలన నన్ను ఏమీ అనేవారు కాదు. దగ్గరుండి వంటలు చేయడం నేర్పేవారు. ఆమె పులిహోర అద్భుతంగా చేస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు వంటలు .. పూజ ఆమెనే చేసేవారు. నాతో పురాణాలు చదివించేవారు. నాకు పనులు చెప్పేవారు కాదు, చేయనిచ్చేవారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నన్ను కోడలిగా కాదు .. కూతురులా చూసుకునేవారు" అని చెప్పారు. 

Suryakantham
Suryakantham actress
Eswari Rani
Suman TV interview
Telugu cinema
Character artist
Tollywood actress
Suryakantham family
Telugu movies

More Telugu News