Chandrababu: స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాకారం.. పారిశుద్ధ్య కార్మికులే దేవుళ్లు: సీఎం చంద్రబాబు

Chandrababu praises sanitation workers as Gods
  • పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని కొనియాడిన సీఎం చంద్రబాబు
  • విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రదానం చేసిన ముఖ్యమంత్రి
  • జనవరి 1 నాటికి రాష్ట్రాన్ని జీరో వేస్ట్ గమ్యానికి చేర్చడమే లక్ష్యం
  • గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే.. మేం సంపద సృష్టించామని వెల్లడి
  • పారిశుద్ధ్య కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం
  • ప్రతి ఏటా స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇస్తామని సీఎం ప్రకటన
రాష్ట్రంలో పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని, వారిని చూస్తుంటే ఆపరేషన్ సిందూర్ వీరులు గుర్తుకొస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర కల సాకారమవుతుందని, ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... "మన పరిసరాలు, మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉన్నాయంటే దానికి కారణం పారిశుద్ధ్య కార్మికులే. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వారు దేవుడితో సమానం. తెల్లవారుజామున 4 గంటలకే విధులకు హాజరయ్యే వారి రుణం తీర్చుకోలేనిది" అని భావోద్వేగంగా అన్నారు. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలు, వ్యక్తులకు 21 కేటగిరీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులను ఆయన అందజేశారు.

చెత్తపై పన్ను కాదు.. చెత్తతో సంపద సృష్టిస్తున్నాం: చంద్రబాబు
గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి ప్రజలను ఇబ్బంది పెడితే, తమ కూటమి ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చంద్రబాబు స్పష్టం చేశారు. "మేం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. తిరుమలలో సైతం ఇదే పరిస్థితి. మేం వచ్చాక చెత్త పన్ను రద్దు చేయడమే కాకుండా, పేరుకుపోయిన చెత్తను తొలగించాం" అని తెలిపారు. జనవరి 1వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ‘జీరో వేస్ట్’ రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు.

పారిశుద్ధ్య కార్మికులకు రూ. కోటి బీమా 
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా లేదా పూర్తి వైకల్యానికి గురైనా వారి కుటుంబానికి రూ. కోటి బీమా అందించేలా యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. దీంతో పాటు వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా, పిల్లల చదువులకు ఆర్థిక సాయం వంటి సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.

‘యూజ్ అండ్ త్రో’ విధానానికి స్వస్తి
‘యూజ్ అండ్ త్రో’ విధానానికి స్వస్తి పలికి ‘యూజ్-రికవర్-రీయూజ్’ పాలసీని అమలు చేస్తున్నామని, వ్యర్థ పదార్థాలను ఆదాయ వనరుగా మార్చేందుకు ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రజల నుంచి పొడి చెత్త సేకరించి, బదులుగా నిత్యావసరాలు అందించే ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని మరో 100 మండలాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ, ప్రతి ఏటా స్వచ్ఛాంధ్ర అవార్డులు అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, కొలుసు పార్థసారథి, స్వచ్ఛాంధ్ర ఛైర్మన్ పట్టాభి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu
Swachh Andhra Pradesh
Swarna Andhra Pradesh
Cleanliness workers
Vijayawada
Zero waste Andhra Pradesh
Waste management
Sanitation workers insurance
Circular Economy
Swachh Bharat

More Telugu News