Vangalapudi Anitha: జగన్ హయాంలో కల్తీ మద్యంతో ప్రాణాలు తీశారు: అనిత

Anitha slams Jagan for adulterated liquor deaths in Andhra Pradesh
  • ప్రజారోగ్యంపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదన్న అనిత 
  • కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులకు పరామర్శ
  • విద్యార్థుల అస్వస్థతపై విచారణకు నిపుణుల కమిటీ వేశామని వెల్లడి
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారిందని, దాని కారణంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపణలు చేశారు. ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు లేదని ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం వల్ల జరిగిన మరణాలను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.

మన్యం జిల్లాకు చెందిన గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురై విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం హోంమంత్రి అనిత వారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

విద్యార్థుల అస్వస్థత ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని, వైద్య నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణకు ఆదేశించామని అనిత తెలిపారు. పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నిన్న మంత్రి సంధ్యారాణి కూడా విద్యార్థులను పరామర్శించారని ఆమె పేర్కొన్నారు.

గత జగన్ ప్రభుత్వంలో ఇద్దరు గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చినా, వారు ఒక్కసారి కూడా ఆశ్రమ పాఠశాలల వైపు కన్నెత్తి చూడలేదని అనిత విమర్శించారు. కానీ ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఆమె వివరించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. 
Vangalapudi Anitha
Andhra Pradesh
YCP
Jagan Mohan Reddy
Adulterated liquor
Jangareddygudem
Tribal students
Hostel students health
Vizag KGH
Home Minister

More Telugu News