Nara Lokesh: జగన్ గారూ... కల్తీ మద్యం పట్టుకున్నదే మా ప్రభుత్వం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Slams Jagan Over Adulterated Liquor Allegations
  • కల్తీ మద్యంపై జగన్‌కు మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
  • నిందితులను పట్టుకుని, సస్పెండ్ చేసింది తమ ప్రభుత్వమేనని వెల్లడి
  • 'జే' బ్రాండ్లతో వేల మంది ప్రాణాలు తీశారని జగన్‌పై ఆరోపణ
  • జంగారెడ్డిగూడెం మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించారని విమర్శ
  • డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును వెనకేసుకొచ్చారని ధ్వజం
  • కల్తీ మద్యంపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని స్పష్టం
రాష్ట్రంలో కల్తీ మద్యం అంశంపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో బదులిచ్చారు. కల్తీ మద్యం గురించి, నిందితులకు వత్తాసు పలకడం గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని ఆయన ధ్వజమెత్తారు. జగన్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని పలు ఘటనలను ఆయన గుర్తు చేశారు.

కల్తీ మద్యాన్ని పట్టుకుంది, నిందితులను అరెస్ట్ చేయించింది తమ ప్రభుత్వమేనని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో టీడీపీ నేతలు ఉన్నప్పటికీ, వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిందితుల్లో ఇద్దరు తమ పార్టీకి చెందిన వారు కాగా, వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. కానీ, జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏం చేశారో మరిచిపోయి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డబ్బు కోసం 'జే' బ్రాండ్లను ప్రవేశపెట్టి వేల మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని లోకేశ్ ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి పలువురు మరణిస్తే, వాటిని సహజ మరణాలుగా చిత్రీకరించి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. అప్పటి మంత్రి జోగి రమేశ్ బాధితుల పట్ల అహంకారంగా మాట్లాడిన మాటలను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని అన్నారు.

అదేవిధంగా, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి కనీసం సస్పెండ్ చేయలేదని లోకేశ్ విమర్శించారు. పైగా, అలాంటి వ్యక్తిని ఇంటికి పిలిపించి భోజనం పెట్టి సన్మానించిన జగన్‌కు, తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. కల్తీ మద్యంపై జగన్ నిన్న చేసిన ట్వీట్‌కు బదులుగా లోకేశ్ ఈ విధంగా స్పందించారు.
Nara Lokesh
Jagan
YCP
TDP
Adulterated Liquor
Andhra Pradesh Politics
J Brand Liquor
Jogi Ramesh
Ananta Babu
Subrahmanyam Murder Case

More Telugu News