Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. మజ్లిస్ విషయంలో మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud Comments on Majlis in Jubilee Hills By Election
  • మజ్లిస్ పార్టీ తమతోనే ఉంటుందన్న టీపీసీసీ చీఫ్
  • మజ్లిస్ తమకు ఫ్రెండ్లీ పార్టీ అన్న మహేశ్ కుమార్ గౌడ్
  • రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తమతోనే ఉంటుందని, తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మజ్లిస్ తమకు ఫ్రెండ్లీ పార్టీ అని వ్యాఖ్యానించారు.

కంటోన్మెంట్ మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టిక్కెట్‌ను బీసీలకు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై కూడా ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితిని బట్టి మిత్రపక్షాల అభ్యర్థులకు కూడా టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. సీపీఎం, సీపీఐ, తెలంగాణ జనసమితి అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

డిసెంబర్ చివరి నాటికి పార్టీ పదవులన్నింటిని భర్తీ చేస్తామని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును తాము ముందుగా ఊహించిందేనని ఆయన అన్నారు. త్వరలో కామారెడ్డిలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.
Mahesh Kumar Goud
Jubilee Hills by election
TPCC
Majlis party
Congress party
Telangana politics

More Telugu News