YS Jagan Mohan Reddy: ఉద్యోగులను మోసం చేశారు: ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు

Jagan Slams AP Government Over Employee Promises
  • ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని జగన్ ఆరోపణ
  • ఎన్నికల హామీలను విస్మరించారంటూ తీవ్ర విమర్శలు
  • పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిల ఊసే లేదని ధ్వజం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వారిని నమ్మించి మోసం చేస్తోందని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసి, భూ పందేరాలపైనే కేబినెట్ సమావేశాల్లో చర్చిస్తున్నారని ఆరోపించారు. 

"అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా, మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. తీపి మాటలతో అరచేతిలో వైకుంఠం చూపి, ఇప్పుడు వారిని నడిరోడ్డుపై నిలబెట్టారు" అని జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామన్న మధ్యంతర భృతి (ఐఆర్) ఊసే లేదని, మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో వారం రోజుల్లోనే ఐఆర్ ప్రకటించడమే కాకుండా, పీఆర్సీ కమిషన్‌ను కూడా నియమించామని గుర్తుచేశారు. కానీ, ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పీఆర్సీ ఛైర్మన్‌ను తొలగించి, ఉద్యోగులకు జీతాలు పెరగకుండా అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

ఉద్యోగులకు చెల్లించాల్సిన నాలుగు డీఏలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని, పండుగలకు కూడా బకాయిలు చెల్లించకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారని జగన్ పేర్కొన్నారు. సీపీఎస్/జీపీఎస్‌పై ఆమోదయోగ్యమైన పరిష్కారం అని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానాన్నే ఇప్పుడు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు.

ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు, డీఏలు, జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి వాటి కింద ప్రభుత్వం సుమారు రూ.31 వేల కోట్లు బకాయి పడిందని జగన్ ఆరోపించారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏ తేదీన జీతాలు వస్తాయో తెలియని దుస్థితికి ఉద్యోగులను నెట్టారని అన్నారు. తమ హయాంలో కరోనా సంక్షోభంలోనూ సకాలంలో జీతాలు ఇచ్చామన్నారు.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలోనూ ఈ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వం 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభిస్తే, ఈ ప్రభుత్వం దానిని నిలిపివేసి వారి జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు తాము తీసుకొచ్చిన ఆప్కాస్‌ను రద్దు చేసి, మళ్లీ పాత దోపిడీ విధానాన్ని తెస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి, కుట్రపూరితంగా వారిని రోడ్డున పడేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఈహెచ్ఎస్ వాటాను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆసుపత్రుల్లో వైద్యం అందడం లేదని, ఇది అత్యంత దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. 
YS Jagan Mohan Reddy
AP Government
Government Employees
Employee Welfare
PRC
DA Arrears
CPS GPS
Contract Employees
Outsourcing Employees
AP CM

More Telugu News