Mswati III: 15 మంది భార్యలు, వంద మంది పరివారంతో రాజు విహారం.. ఆకలితో అల్లాడుతున్న ప్రజలు!

King Mswati IIIs Abu Dhabi Trip Faces Backlash
  • 15 మంది భార్యలతో అబుదాబిలో దిగిన ఎస్వాటిని రాజు
  • సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్న పాత వీడియో
  • రాజు విలాసాలపై నెటిజన్ల తీవ్ర విమర్శలు
  • ప్రజలు ఆకలితో ఉంటే ఈ జల్సాలు ఏంటని ఆగ్రహం
  • దేశంలో 60 శాతానికి పైగా ప్రజలు పేదరికంలోనే
ఒకవైపు దేశ ప్రజలు దారుణమైన పేదరికంతో, ఆకలితో అల్లాడుతుంటే.. మరోవైపు ఆ దేశ రాజు మాత్రం 15 మంది భార్యలు, వంద మంది సేవకులతో ప్రైవేట్ జెట్‌లో విహరిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ కావడంతో, ఆ రాజు విలాసవంతమైన జీవితంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఎవరా రాజు? ఆయన కథేంటి?

వివరాల్లోకి వెళితే.. ఆఫ్రికాలోని చివరి నిరంకుశ రాచరిక దేశమైన ఎస్వాటిని (గతంలో స్వాజీల్యాండ్) రాజు మూడవ మస్వాతి, కొన్నేళ్ల క్రితం అబుదాబి పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఆయన తన 15 మంది భార్యలు, 30 మంది పిల్లలు, 100 మంది సహాయకులతో కలిసి ఒక ప్రైవేట్ జెట్‌లో అబుదాబి విమానాశ్రయంలో దిగారు. రాజు, ఆయన భార్యలు సంప్రదాయ వస్త్రధారణలో విమానం నుంచి దిగుతున్న దృశ్యాలు ఇప్పుడు మళ్లీ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భారీ పరివారం కారణంగా ఆ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లోని పలు టెర్మినళ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రాజు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "దేశంలో ప్రజలకు కనీసం కరెంట్, తాగునీరు వంటి సౌకర్యాలు లేవు. కానీ రాజుగారికి మాత్రం ఈ రాజభోగాలా?" అని ఒకరు ప్రశ్నించారు. "ప్రజలు ఆకలితో చనిపోతుంటే, ఈయన మాత్రం ప్రైవేట్ జెట్లలో షికార్లు కొడుతున్నాడు" అని మరో యూజర్ మండిపడ్డారు. "ఇంత మంది భార్యలను మేనేజ్ చేయడానికి ఇంట్లో ఏమైనా కోఆర్డినేటర్ ఉన్నాడా?" అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

వివిధ నివేదికల ప్రకారం, 1986 నుంచి పాలిస్తున్న రాజు మస్వాతి వ్యక్తిగత ఆస్తి విలువ 1 బిలియన్ డాలర్లకు పైమాటే. ఆయనకు నిర్మాణం, టూరిజం, టెలికమ్యూనికేషన్స్ వంటి అనేక వ్యాపారాల్లో వాటాలు ఉన్నాయి. మరోవైపు, ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఎస్వాటినిలో నిరుద్యోగం 33.3 శాతానికి చేరుకుంది. దేశ జనాభాలో దాదాపు 60 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారు. విద్య, వైద్య వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజుగారి విలాసాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రతీ ఏటా జరిగే సంప్రదాయ వేడుకలో రాజు ఒక కొత్త యువతిని భార్యగా ఎంచుకోవడం అక్కడి ఆనవాయతీ కావడం గమనార్హం.
Mswati III
Eswatini
King Mswati III
Swaziland
Africa
Royal Family
Poverty
Abu Dhabi
Private Jet
Social Media

More Telugu News