Bihar Assembly Elections: రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు

Bihar Assembly Elections in Two Phases Counting on November 14
  • నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు
  • 14 లక్షల కొత్త ఓటర్లు సహా 7.43 కోట్ల ఓటర్లు ఉన్నట్లు వెల్లడి
  • తుది జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చామన్న ఈసీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని, నవంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తామని భారత ఎన్నికల కమిషన్ సోమవారం తెలిపింది. కేంద్ర ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషితో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియాకు పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను వెల్లడించారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా సాగుతాయని బీహార్ ఓటర్లకు హామీ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నిక ఇది అని, 14 లక్షల మంది కొత్త ఓటర్లతో కలిపి మొత్తం 7.43 కోట్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.

ఓటరు జాబితా సవరణ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు 10 రోజుల వరకు ఓటర్ల జాబితాలో దిద్దుబాట్లకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ సమాచారాన్ని ఎదుర్కోవడానికి ఈసీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించినట్లు చెప్పారు.

2020లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. నితీశ్ కుమార్ రెండేళ్ల తర్వాత బీజేపీని వీడి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిశారు. ఆ బంధం ఎక్కువ రోజులు నిలువలేదు. 2024 జనవరిలో బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

అక్టోబర్ 18, 28 తేదీల్లో దీపావళి, ఛాత్ పండుగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను సిద్ధం చేసిందని భావిస్తున్నారు. ఒక్కో పోలింగ్ బూత్‌లో 1,200 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం 90,000కు పెంచింది.
  
Bihar Assembly Elections
Bihar Elections
Election Commission of India
Nitish Kumar
Bihar Politics

More Telugu News