AI layoffs: ఏఐతో ఉద్యోగాల తొలగింపు.. సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లతో పని.. వైరల్ అవుతున్న రెడిట్ పోస్ట్!

Reddit Post AI Replacing Senior Employees
  • ఏఐతో ఉద్యోగాల తొలగింపు నిజమేనంటూ రెడిట్ పోస్ట్
  • సీనియర్లను తొలగించి, జూనియర్లతో పనిచేయిస్తున్న కంపెనీ
  • ఏఐ టూల్స్ వాడటం లేదని టాప్ పెర్ఫార్మర్‌పై సీఈఓ ఒత్తిడి
  • ఇప్పటికే లీడ్స్, ఆర్కిటెక్టులను తొలగించారన్న యూజర్
  • కంపెనీల తీరుపై నెటిజన్ల విమర్శలు.. ఇది తిప్పికొడుతుందని హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాలు నిజమవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు, లాభాలు పెంచుకునేందుకు కంపెనీలు ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపు పర్వం ఇప్పటికే మొదలైందని చాటిచెబుతున్న ఓ రెడిట్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

‘ఇండియన్ వర్క్‌ప్లేస్’ అనే రెడిట్ గ్రూపులో "ఏఐ రీప్లేస్‌మెంట్ ఈజ్ రియల్" (ఏఐతో తొలగింపు నిజం) అనే పేరుతో ఓ యూజర్ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. తన కంపెనీలో సీనియర్, మధ్యస్థాయి ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో కేవలం అనుభవం లేని అసోసియేట్లు, ఇంటర్న్‌లను మాత్రమే నియమించుకోవాలని తమ సీఈఓ భావిస్తున్నారని ఆ యూజర్ పేర్కొన్నారు. ఇందుకోసం ఏకంగా 15 నుంచి 20 ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

కంపెనీ అభివృద్ధి చేసిన ఏఐ టూల్‌ను వాడటం లేదనే కారణంతో, అవార్డులు గెలుచుకున్న ఓ టాప్ పెర్ఫార్మర్‌పై సీఈఓ దాదాపు రెండు గంటల పాటు ఒత్తిడి చేశారని ఆ పోస్టులో వెల్లడించారు. ఇప్పటికే కంపెనీలోని చాలా మంది టీమ్ లీడ్స్, ఆర్కిటెక్టులను తొలగించారని, ఇక అంతా ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో, నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఏఐ మోజులో పడి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం సరైన పద్ధతి కాదని, ఇది భవిష్యత్తులో తిప్పికొడుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు. "ఏఐ రాసిన కోడ్‌ను అర్థం చేసుకోవడానికి, దాన్ని సరిచేయడానికి మళ్లీ నిపుణులైన టెకీలు అవసరమవుతారు" అని ఒకరు కామెంట్ చేయగా, "కొన్నేళ్ల తర్వాత జూనియర్లు, ఏఐ కలిసి సృష్టించిన అయోమయాన్ని సరిచేయడానికి మళ్లీ సీనియర్లనే నియమించుకోవాల్సి వస్తుంది" అని మరొకరు అభిప్రాయపడ్డారు. మంచి డ్రైవర్ లేకపోతే రేసు కారుతో పరుగు పందెం గెలవలేమని, అలాగే నిపుణుడైన డెవలపర్ లేకుండా ఏఐతో గొప్ప ఉత్పత్తులను సృష్టించడం అసాధ్యమని ఇంకొందరు పేర్కొన్నారు.

కాగా, గత వారం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా ప్రస్తుత ఏఐ క్రేజ్‌ను ఒక 'పారిశ్రామిక బబుల్' (పారిశ్రామిక బుడగ)గా అభివర్ణించడం గమనార్హం.
AI layoffs
Artificial Intelligence
Reddit post
job cuts
tech industry
senior employees
junior employees
cost reduction
company profits
AI tools

More Telugu News