Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర రూ. 1,23,420

Gold Price Soars in Hyderabad 24 Carat Gold Reaches 123420
  • రూ. 1,10,700 పలుకుతున్న 22 క్యారెట్ల పసిడి ధర
  • అంతర్జాతీయ మార్కెట్‌లో 4,000 డాలర్లకు చేరువైన బంగారం
  • పెరుగుదలకు అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్‌డౌన్ సహా పలు కారణాలు
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,420కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,10,700గా ఉంది. వెండి ధర కూడా రోజురోజుకూ పెరుగుదల బాటలో పయనిస్తోంది.

హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 1.54 లక్షలకు చేరింది. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. పసిడి ఆభరణాల విక్రయాలు ఈ మధ్యకాలంలో తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.

బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్‌డౌన్, డొనాల్డ్ ట్రంప్ అధిక టారిఫ్ విధింపు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు వంటి అంశాలు పసిడి డిమాండ్‌కు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్సు 3,935 డాలర్లుగా నమోదైంది. పసిడి ధర పెరుగుదలకు ప్రధానంగా అమెరికా షట్‌‍డౌన్ కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన డేటా ఏదీ అందుబాటులో లేకుండా పోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన మానిటరీ పాలసీ నిర్ణయాలకు ఈ డేటానే కీలకంగా పరిగణిస్తుంది. ఈ అనిశ్చితి ఎంత కాలం కొనసాగుతుందో స్పష్టత లేకపోవడమే బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.
Gold Price
Hyderabad gold rate
24 Carat gold price
22 Carat gold price
Silver price
Hyderabad bullion market

More Telugu News