Michael Atherton: భారత్-పాక్ మ్యాచ్‌లపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అథర్టన్ సంచలన వ్యాఖ్యలు

Michael Atherton Slams ICC Over India Pakistan Match Scheduling
  • ఐసీసీ టోర్నీల డ్రాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అథర్టన్ విమర్శలు
  • ప్రతీ టోర్నీలో భారత్-పాక్‌లను ఒకే గ్రూపులో ఉంచడంపై అభ్యంతరం
  • వాణిజ్య ప్రయోజనాల కోసమే ఐసీసీ ఇలా చేస్తోందని ఆరోపణ
  • క్రికెట్‌ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆవేదన
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్ల డ్రా విధానంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి మేజర్ టోర్నీలో కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే భారత్, పాకిస్థాన్‌ జట్లను ఒకే గ్రూపులో ఉంచుతున్నారని, ఈ పద్ధతికి స్వస్తి పలికి డ్రాలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశాడు.

ఇటీవల ముగిసిన 2025 ఆసియా కప్‌లో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఆటపై ప్రభావం చూపిన నేపథ్యంలో అథర్టన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. "ఐసీసీ ఈవెంట్లలో చాలా ఏళ్లుగా భారత్, పాకిస్థాన్‌లను ఒకే గ్రూపులో చూడటం పరిపాటిగా మారింది. దీని వెనుక ఉన్న కారణాలను ఐసీసీ ఎప్పుడూ స్పష్టంగా వివరించలేదు. కేవలం ఈ రెండు జట్ల మధ్య కనీసం ఒక మ్యాచ్ అయినా జరిగేలా చూడటానికే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది" అని ఆయన అన్నారు.

భారత్-పాక్ మ్యాచ్‌కు ఉన్న ఆర్థిక విలువ చాలా పెద్దదని, అందుకే ఐసీసీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడవుతున్నాయని అథర్టన్ తన కాలమ్‌లో పేర్కొన్నాడు. 2023-27 సైకిల్‌కు గాను ప్రసార హక్కుల విలువ సుమారు 3 బిలియన్ డాలర్లుగా ఉందని గుర్తుచేశాడు. "ఒకప్పుడు దౌత్య సంబంధాలకు వారధిగా ఉన్న క్రికెట్, ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తతలకు, ప్రచారాలకు ప్రతీకగా మారింది. కేవలం డబ్బు కోసం ఒక క్రీడాసంస్థ తమ టోర్నమెంట్ ఫిక్చర్‌లను మార్చుకోవడంలో అర్థం లేదు" అని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కూడా ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని, ఆసియా కప్ ఫార్మాట్‌ను ఒకే నెలలో మూడుసార్లు ఈ జట్లు తలపడేలా రూపొందించారని ఆయన విమర్శించారు. రాబోయే ప్రసార హక్కుల సైకిల్ నుంచైనా ఐసీసీ డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఒకవేళ డ్రాలో ఈ రెండు జట్లు ఎదురుపడకపోయినా ఫర్వాలేదని అథర్టన్ స్పష్టం చేశారు.
Michael Atherton
ICC
India vs Pakistan
cricket
Asia Cup
cricket tournament
revenue
broadcast rights
political tensions
ACC

More Telugu News