EPFO: ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. ఇకపై పీఎఫ్ సేవలు మరింత సులభం

EPFO Key Decision PF Services Easier Now
  • ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ కీలక సంస్కరణలు
  • 15 రకాల పీఎఫ్ సేవలు ఇకపై మరింత వేగవంతం
  • అకౌంట్స్ ఆఫీసర్లకే పలు కీలక అధికారాల బదిలీ
  • ఫైనల్ క్లెయిమ్‌లో పాక్షిక చెల్లింపులకు గ్రీన్‌సిగ్నల్
  • ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి 'అనెక్చర్-కె' పత్రం
కోట్లాది మంది ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) శుభవార్త చెప్పింది. పీఎఫ్ క్లెయిమ్స్, బదిలీలు, ఇతర సేవలను మరింత సులభతరం చేస్తూ కీలక సంస్కరణలను అమలులోకి తెచ్చింది. ఈ కొత్త మార్పుల వల్ల ఉద్యోగులకు సమయం ఆదా అవ్వడంతో పాటు, పనులన్నీ వేగంగా పూర్తికానున్నాయి.

ఇప్పటివరకు కొన్ని ప్రత్యేక క్లెయిమ్స్, సర్వీసుల కోసం రీజనల్ పీఎఫ్ కమిషనర్ స్థాయి అధికారి ఆమోదం తప్పనిసరిగా ఉండేది. ఈ నిబంధనను ఈపీఎఫ్ఓ సడలించింది. ఇకపై దాదాపు 15 రకాల కీలక సేవలను అకౌంట్స్ ఆఫీసర్ లేదా సహాయ పీఎఫ్ కమిషనర్ స్థాయిలోనే పరిష్కరించేలా అధికారాలను బదిలీ చేసింది. పీఎఫ్ అడ్వాన్సులు, వడ్డీ లెక్కింపులో పొరపాట్లు, పాత సర్వీసును ప్రస్తుత కంపెనీ సర్వీసుతో కలపడం వంటి పనులు ఇకపై వేగంగా జరగనున్నాయి. ఈ మేరకు అదనపు కేంద్ర పీఎఫ్ కమిషనర్ సుచింద్రనాథ్ సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా మార్పుల్లో భాగంగా, ఫైనల్ క్లెయిమ్‌ల విషయంలో ఈపీఎఫ్ఓ ఒక ముఖ్యమైన వెసులుబాటు కల్పించింది. గతంలో, ఒక ఉద్యోగి పనిచేసిన కాలానికి కంపెనీ పూర్తిస్థాయిలో పీఎఫ్ చందా చెల్లించకపోతే, ఆ ఉద్యోగి ఫైనల్ క్లెయిమ్‌ను తిరస్కరించేవారు. కానీ ఇకపై అలా జరగదు. కంపెనీ ఎంత మొత్తం చెల్లించిందో, ఆ మేరకు పాక్షిక చెల్లింపులు (పార్ట్ పేమెంట్స్) చేయడానికి అనుమతి ఇచ్చారు. మిగిలిన బకాయిలను కంపెనీ నుంచి వసూలు చేసి, ఆ తర్వాత తుది చెల్లింపు చేస్తారు.

అలాగే, ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతా వివరాలను కొత్త ఖాతాకు బదిలీ చేయడానికి 'అనెక్చర్-కె' అనే పత్రం కీలకం. ఇందులో ఉద్యోగి సర్వీసు, పీఎఫ్ బ్యాలెన్స్ వంటి వివరాలు ఉంటాయి. ఇప్పటివరకు దీనికోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై ఈ పత్రాన్ని నేరుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ నుంచే ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.


EPFO
Employees Provident Fund Organisation
PF claims
PF transfer
PF services
Regional PF Commissioner
Accounts Officer
PF advance
Annexture-K

More Telugu News