Vijayawada: భార్య వెళ్లిపోయిందని చిన్నమ్మపై పగ.. 13 ఏళ్ల తర్వాత దారుణ హత్య!

Vijayawada Man Murders Aunt After 13 Years Over Wife Dispute
  • విజయవాడలో వెలుగులోకి వచ్చిన దారుణ హత్య
  • భార్య దూరమవడానికి చిన్నమ్మే కారణమని పగ
  • 13 ఏళ్ల తర్వాత మేనల్లుడి క్రూర ప్రతీకారం
  • కొడుకుతో కలిసి చిన్నమ్మను నరికి చంపిన వైనం
  • మృతదేహాన్ని ముక్కలు చేసి వేర్వేరు కాల్వల్లో పారవేత
  • సీసీటీవీ ఫుటేజ్‌తో నిందితులను పట్టుకున్న పోలీసులు
పదమూడేళ్ల కిందట భార్య తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోవడానికి చిన్నమ్మే కారణమని ఓ వ్యక్తి తీవ్ర పగ పెంచుకున్నాడు. సమయం కోసం వేచి చూసి, చివరికి కుమారుడితో కలిసి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికి, గోనె సంచుల్లో మూటగట్టి వేర్వేరు కాల్వల్లో పడేశాడు. దసరా పండుగకు ముందు విజయవాడ భవానీపురంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భవానీపురం ఉర్మిళానగర్‌కు చెందిన పొత్తూరి విజయలక్ష్మి (65) తన కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. ఆమె అక్క కొడుకైన వంకధార హనుమాన్‌జీ సుబ్రహ్మణ్యం, తన భార్య హారికతో విభేదాల కారణంగా 2012 నుంచి దూరంగా ఉంటున్నాడు. భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడానికి తన చిన్నమ్మ విజయలక్ష్మే కారణమని సుబ్రహ్మణ్యం బలంగా నమ్మాడు. అప్పటి నుంచి ఆమెపై పగతో రగిలిపోతున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల‌ 1న సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఆమెతో ఎంతో మంచిగా మాట్లాడి నమ్మించి, తన బైక్‌పై భవానీపురంలోని హెచ్‌బీ కాలనీలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే ఉన్న తన 16 ఏళ్ల కుమారుడితో కలిసి ఆమెపై దాడి చేశాడు. ఇంట్లోని పెద్ద కత్తితో విజయలక్ష్మి మెడ నరికి హత్య చేశారు. అనంతరం తండ్రీకొడుకులిద్దరూ కలిసి మృతదేహాన్ని నాలుగు భాగాలుగా చేసి, గోనె సంచుల్లో కుక్కి నగరంలోని వేర్వేరు మురుగు కాల్వల్లో పడేశారు.

విజయలక్ష్మి కనిపించకపోవడంతో ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, సుబ్రహ్మణ్యం ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. విజయలక్ష్మిని అతడే బైక్‌పై తీసుకెళ్లినట్లు గుర్తించి, తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలో మైనర్ కుమారుడు భాగం కావడం స్థానికంగా కలకలం రేపింది.
Vijayawada
Potturi Vijayalakshmi
Vijayawada murder
Bhavanipuram
Vankadhara Hanumanji Subramanyam
family dispute
crime news
Andhra Pradesh police
revenge killing
minor involvement
HB Colony

More Telugu News