Jyotiraditya Scindia: త్వరలోనే బీఎస్ఎన్ఎల్ 4జీని 5జీగా అప్‌గ్రేడ్ చేస్తాం: జ్యోతిరాదిత్య సింధియా

Jyotiraditya Scindia Announces BSNL 4G to 5G Upgrade Soon
  • వచ్చే 6-8 నెలల్లో BSNL 5G సేవలు
  • కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడి
  • ప్రస్తుత 4G టవర్లనే 5Gకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటన
  • 17 ఏళ్ల తర్వాత లాభాల్లోకి వచ్చిన బీఎస్ఎన్ఎల్
  • ఏడాదిలోనే భారీగా 78 లక్షల నుంచి 2.2 కోట్లకు పెరిగిన చందాదారులు
  • పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో 4జీ నెట్‌వర్క్ అభివృద్ధి
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం దేశీయంగా అభివృద్ధి చేసిన 4G నెట్‌వర్క్‌ను రాబోయే 6 నుంచి 8 నెలల్లోనే 5Gకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఈ మార్పుతో త్వరలోనే బీఎస్ఎన్ఎల్ కూడా ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఆదివారం ఢిల్లీలో జరిగిన 'కౌటిల్య ఎకనామిక్ సదస్సు 2025'లో ఆయన మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు. భారతదేశం తన సొంత 4G ప్రమాణాలతో సాంకేతిక రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని, ఇది దేశ ఆవిష్కరణ సామర్థ్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. "ఇంతటితో మేము ఆగిపోము. రాబోయే 6-8 నెలల్లో ఈ 4G టవర్లను 5G నెట్‌వర్క్‌గా మారుస్తాం. దేశవ్యాప్తంగా ఎండ్-టు-ఎండ్ 5G సేవలను అందిస్తాం" అని సింధియా స్పష్టం చేశారు.

గత నెలలో బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిన 'స్వదేశ్ 4G నెట్‌వర్క్' లేదా భారత్ టెలికాం స్టాక్‌ను పూర్తిగా భారతదేశంలోనే రూపొందించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT), తేజస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్ సహకారంతో ఈ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశారు. ఈ ఘనతతో, సొంతంగా టెలికాం టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐదు దేశాల సరసన భారత్ చేరిందని ఆయన గుర్తుచేశారు.

17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీఎస్ఎన్ఎల్ మళ్లీ లాభాల బాట పట్టిందని సింధియా తెలిపారు. కేవలం ఏడాది కాలంలోనే సంస్థ చందాదారుల సంఖ్య 78 లక్షల నుంచి 2.2 కోట్లకు పెరిగిందని వివరించారు. ఈ కొత్త నెట్‌వర్క్ ద్వారా ఇప్పటికే 26,700 గ్రామాలకు తొలిసారిగా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ వ్యవసాయం, టెలిమెడిసిన్ వంటి సేవలు మరింత విస్తృతం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
Jyotiraditya Scindia
BSNL 4G
BSNL 5G Upgrade
India 5G Network
Telecom Sector India
Bharat Sanchar Nigam Limited
TCS
C-DOT
Tejas Networks

More Telugu News