YS Sharmila: ఆటో డ్రైవర్లకు చంద్రబాబు చేసింది ఘరానా మోసం: షర్మిల

YS Sharmila Criticizes Chandrababus Auto Driver Scheme
  • ఆటో డ్రైవర్ల సేవలో పథకంపై చంద్రబాబు సర్కారు మోసం చేసిందన్న షర్మిల
  • కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
  • 13 లక్షల మందికి హామీ ఇచ్చి, 2.90 లక్షల మందికే పరిమితం చేశారని ఆరోపణ
  • గత వైసీపీ ప్రభుత్వానికి, ఇప్పటి టీడీపీకి ఈ విషయంలో తేడా లేదని వ్యాఖ్య
  • డ్రైవర్లందరి ఖాతాల్లో రూ.15 వేలు జమ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్
  • ట్యాక్సీ, భారీ వాహన డ్రైవర్లకూ పథకాన్ని వర్తింపజేయాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, ప్రస్తుత అమలుకు పొంతన లేదని, ఇది డ్రైవర్లను ఘోరంగా మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని డ్రైవర్ సోదరులకు మసిపూసి మారేడుకాయ చేశారని మండిపడ్డారు.

"చంద్రబాబుగారి హామీలు బారెడు.. వాటి అమలు మాత్రం మూరెడు. ఏ పథకం అమలు చేసినా సగం సగమే. అన్నింటా కోతలే. నేడు ఆటో డ్రైవర్ అన్నలకు చంద్రబాబు గారు చేసింది ఘరానా మోసం. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఎన్నికల్లో ఊదర గొట్టిన ప్రసంగాలకు, అమలు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో 15 వేల పథకానికి పొంతనే లేదు. ఖాకీ చొక్కాలు వేసుకుని, ఆటోల్లో తిరిగినట్లు ఫొటోలకు పోజులిచ్చి, వారి కుటుంబాలను ఉద్ధరించినట్లు కాకమ్మ కబుర్లు చెప్పి, డ్రైవర్ అన్నలకు మసి పూసి మారేడుకాయ చేశారు. 

ఆటో డ్రైవర్లను మోసగించడంలో గత వైసీపీ ప్రభుత్వానికి, నేడు కూటమి ప్రభుత్వానికి తేడా లేదు. ఇద్దరూ దొందు దొందే. రాష్ట్రంలో బ్యాడ్జి కలిగిన ప్రతి డ్రైవర్ కి ఏటా 15 వేలు ఇస్తాం అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఓనర్ కం డ్రైవర్ కింద 2.60 లక్షల మందికి మాత్రమే వాహన మిత్ర ఇచ్చిందని నాడు మీరు ఎద్దేవా చేశారు. 13 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే 10 శాతం మందికి కూడా పథకం దక్కలేదని మండిపడ్డారు. అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీలు ఇచ్చారు. అన్ని మాటలు చెప్పి 15 వేల పథకాన్ని కేవలం 2.90 లక్షల మందికే ఎలా ఇచ్చారు చంద్రబాబు గారూ? 

రాష్ట్రంలో బ్యాడ్జి కలిగిన డ్రైవర్ల సంఖ్య RTA లెక్కల ప్రకారం సుమారు 15 లక్షలు. పోనీ మీ లెక్క ప్రకారం 13 లక్షల మంది బ్యాడ్జి కలిగిన వారికి కాకుండా మీరు కూడా 10 శాతం మందికే ఎలా ఇచ్చారు? మీరు సైతం ఓనర్ కం డ్రైవర్ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారు ? ఆటో తోలుకొని బ్రతికే వారిని ఎలా విస్మరించారు? పథకంలో కోత పెట్టేందుకు 18 నిబంధనలు ఎందుకు పెట్టారు? గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో 30 వేల మందికి అదనంగా ఇచ్చిన మీరు 13 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఉద్ధరించినట్లా?

ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 13 లక్షల మంది డ్రైవర్లకు పథకాన్ని వర్తింపజేయండి. అందరికి 15 వేల చొప్పున అకౌంట్లలో వేయండి. ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ వెహికల్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్ కి కూడా 15 వేలు ఇవ్వండి. అన్ని వర్గాల డ్రైవర్లతో కూడిన సాధికార సంస్థను ఏర్పాటు చేయండి" అని షర్మిల తన ప్రకటనలో పేర్కొన్నారు.
YS Sharmila
Andhra Pradesh
Auto drivers
Chandrababu Naidu
Congress Party
AP Politics
Auto Driver Scheme
Welfare schemes
YSRCP
TDP

More Telugu News