YSRCP: ఉత్తరాంధ్రపై వైసీపీ ఫోకస్... ప్రభుత్వ విధానాలపై ఉద్యమానికి పిలుపు

YSRCP Focuses on Uttarandhra Protests Against Government Failures
  • ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కీలక సమావేశం
  • స్టీల్ ప్లాంట్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ
  • స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు, పవన్ మాట తప్పారని నేతల విమర్శ
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు గొల్ల బాబురావు, తనూజ రాణి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

సమావేశం అనంతరం కన్నబాబు మాట్లాడుతూ, కేవలం జగన్‌కు వచ్చిన మంచి పేరును చెరిపేందుకే కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని తీవ్రంగా ఆరోపించారు. చంద్రబాబు పాలన అంటేనే మోసం అని, కబుర్లు చెప్పడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని విమర్శించారు. కూటమి పాలనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం ఖాయమని ఆయన ఆరోపించారు. ఈ నెల 9వ తేదీన జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తారని కన్నబాబు తెలిపారు.

రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని, లేదా మూసివేత తప్పదని స్వయంగా కేంద్ర మంత్రే చెప్పారని అన్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట మార్చారని ధ్వజమెత్తారు. "చంద్రబాబు నిజం చెబితే ఆయన తల పగిలిపోతుంది" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు భారీ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రూ. 800 కోట్లతో కిడ్నీ ఆసుపత్రి కట్టించామని, మూలపేట పోర్టులో 90 శాతం పనులు పూర్తిచేశామని తెలిపారు. తాము చేసిన పనులను చెప్పుకోవడంలో వెనుకబడ్డామని, ఇప్పుడు టీడీపీ నేతలు వాటిని తామే చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

YSRCP
YS Jagan
Andhra Pradesh
Visakha Steel Plant
Privatization
Chandrababu Naidu
Uttarandhra
TDP
Janasena
Political Campaign

More Telugu News