KTR: బస్సు చార్జీల పెంపు దారుణం: రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

KTR Fires on Revanth Govt Over Bus Fare Hike
  • సిటీ బస్సు చార్జీల పెంపుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
  • ఒక్కసారే రూ.10 పెంచడం దుర్మార్గమైన నిర్ణయమన్న కేటీఆర్
  • హైదరాబాద్ ప్రజలపై సీఎం కక్షగట్టారని విమర్శ
జంట నగరాల్లో సిటీ బస్సు చార్జీలను పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కేసారి కనీస చార్జీని ఏకంగా 10 రూపాయలు పెంచడం దుర్మార్గమని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో బస్సు చార్జీలు పెంచడం వల్ల ప్రతి ప్రయాణికుడిపై నెలకు అదనంగా 500 రూపాయల భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో బడుగుజీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కనీస చార్జీపై ఏకంగా 50 శాతం పెంచడం దారుణమని కేటీఆర్ అన్నారు. విద్యార్థుల బస్ పాస్ చార్జీలు, టీ-24 టికెట్ ధరలు పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు సామాన్య ప్రజలపైనా భారం మోపుతోందని మండిపడ్డారు. ఉచిత బస్సు పథకం విఫలమవడం వల్లే ఆర్టీసీ దివాళా తీసిందని, ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. రాజధాని వాసులపై రోజుకు కోటి రూపాయల భారం మోపే ఈ నిర్ణయం, హైదరాబాద్ ప్రజలపై ముఖ్యమంత్రికి ఉన్న కక్షను స్పష్టం చేస్తోందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
Telangana government
Bus fare hike
TSRTC
Hyderabad
Bus pass
BRS party
Public transport

More Telugu News