Ashok Gajapathi Raju: అన్ని మతాలను గౌరవించేవాడే అసలైన నాయకుడు: అశోక్ గజపతిరాజు

Ashok Gajapathi Raju slams YSRCP on temple neglect
  • వైసీపీ హయాంలో ఆలయాల అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారన్న అశోక్ గజపతిరాజు
  • అధికారులు పెత్తనం చేయొద్దని, భక్తులకు సేవ చేయాలని హితవు
  • ఆలయాల ట్రస్ట్ బోర్డుల కార్యకలాపాలు పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్య
గత వైసీపీ పాలనలో దేవదాయ శాఖ అధికారులు కేవలం మంత్రుల బూట్లు నాకుతూ కాలం గడిపారని గోవా గవర్నర్, పైడితల్లి అమ్మవారి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఆలయాల అభివృద్ధిని, భక్తుల మనోభావాలను పూర్తిగా విస్మరించారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలను సైతం గత ప్రభుత్వం చిన్నచూపు చూసిందని అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో ఆలయాల అభివృద్ధి అనే మాటే వినిపించలేదని, మొత్తం వ్యవస్థను గాలికొదిలేశారని విమర్శించారు. అప్పటి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ఆయన ఆలయాల అభివృద్ధికి నయా పైసా కూడా ఉపయోగపడే పని చేయలేదని ఆరోపించారు.

దేవాలయాల్లో అధికారులు పెత్తనం చెలాయించకూడదని, ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోవద్దని ఆయన హితవు పలికారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని దేవుడికి సేవ చేయాలని సూచించారు. ఆలయ ట్రస్ట్ బోర్డుల కార్యకలాపాలు అత్యంత పారదర్శకంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సొంత మతాన్ని ఆచరిస్తూనే, ఇతర మతాలను కూడా గౌరవించాలని అన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించినప్పుడే నిజమైన నాయకుడు అవుతాడని చెప్పారు.
Ashok Gajapathi Raju
Ashok Gajapathi Raju comments
Andhra Pradesh Temples
Vellampalli Srinivas
YSRCP government
Hindu temples AP
Pydithalli Ammavari Temple
Vizianagaram
Religious Harmony
Temple development

More Telugu News