Sandra Kavaluza: యువతకు హెచ్చరిక! మలంలో రక్తమా? అది క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు!

Rectal Bleeding Strongest Sign of Colon Cancer in Young Adults Says Study
  • 50 ఏళ్లలోపు వారిలో పెద్దప్రేగు క్యాన్సర్‌పై కొత్త అధ్యయనం
  • మలంలో రక్తం అత్యంత ప్రమాదకర లక్షణంగా గుర్తింపు
  • ఈ లక్షణం క్యాన్సర్ ముప్పును 850 శాతం పెంచుతున్నట్టు వెల్లడి
  • కుటుంబ చరిత్ర లేకపోయినా అధికంగా కేసులు నమోదు
  • రక్తస్రావం కనిపిస్తే వెంటనే కొలొనోస్కోపీ చేయించుకోవాలని వైద్యుల సూచన
యుక్త వయసులోనే పెద్దపేగు క్యాన్సర్ (కొలొరెక్టల్ క్యాన్సర్) బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఒక కొత్త అధ్యయనం అత్యంత కీలక విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. 50 ఏళ్లలోపు వయసు వారిలో మలద్వారం నుంచి రక్తస్రావం (రెక్టల్ బ్లీడింగ్) కావడం అనేది పెద్దపేగు క్యాన్సర్‌కు అత్యంత బలమైన సంకేతమని పరిశోధకులు తేల్చారు. ఈ లక్షణం ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఇతరులతో పోలిస్తే ఏకంగా 8.5 రెట్లు (850 శాతం) అధికంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

అమెరికాలోని లూయిస్‌విల్లే యూనివర్సిటీ హెల్త్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 2021 నుంచి 2023 మధ్య కొలొనోస్కోపీ పరీక్షలు చేయించుకున్న 50 ఏళ్ల లోపు వయసున్న 443 మంది రోగుల వైద్య రికార్డులను వారు విశ్లేషించారు. వీరిలో దాదాపు సగం మందికి చిన్న వయసులోనే పెద్దపేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. క్యాన్సర్ ఉన్న రోగుల్లో 88 శాతం మంది మలంలో రక్తం వంటి లక్షణాలతోనే వైద్యులను సంప్రదించినట్లు తేలింది.

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన లూయిస్‌విల్లే యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ సాండ్రా కవలుకాస్ మాట్లాడుతూ, "చిన్న వయసులో క్యాన్సర్ బారిన పడుతున్న చాలా మందికి కుటుంబంలో ఎలాంటి క్యాన్సర్ చరిత్ర లేదు. స్క్రీనింగ్ వయసు కంటే తక్కువ వయసున్న వారిలో మలంలో రక్తం కనిపిస్తే, వారికి తప్పనిసరిగా కొలొనోస్కోపీ చేయించే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి" అని సూచించారు.

అధ్యయనంలో తేలిన ఇతర ముఖ్యాంశాలు
సాధారణంగా కుటుంబ చరిత్ర లేదా జన్యుపరమైన కారణాలతో క్యాన్సర్ వస్తుందని భావిస్తారు. అయితే, ఈ అధ్యయనంలో కేవలం 13 శాతం కేసుల్లో మాత్రమే జన్యుపరమైన మార్పులు కనిపించాయి. కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండటం వల్ల ముప్పు కేవలం రెండు రెట్లు మాత్రమే పెరుగుతుందని తేలింది. అదే సమయంలో, గతంలో ధూమపానం చేసిన వారిలో క్యాన్సర్ ప్రమాదం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం కుటుంబ చరిత్ర లేనివారు 45 ఏళ్ల నుంచి పెద్దపేగు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అయితే, యువతలో కేసులు పెరుగుతున్నందున, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తే వయసుతో సంబంధం లేకుండా వైద్యులను సంప్రదించి, అవసరమైతే కొలొనోస్కోపీ చేయించుకోవడం సురక్షితమని ఈ అధ్యయనం నొక్కి చెబుతోంది. "35 ఏళ్ల వ్యక్తి మలద్వారం వద్ద నొప్పితో వస్తే కొలొనోస్కోపీ అవసరం ఉండకపోవచ్చు. కానీ, రక్తస్రావం సమస్యతో వస్తే మాత్రం వారికి క్యాన్సర్ ఉండే అవకాశం 8.5 రెట్లు ఎక్కువ" అని డాక్టర్ కవలుకాస్ స్పష్టం చేశారు.
Sandra Kavaluza
Colorectal cancer
Colon cancer
Rectal bleeding
Young adults
Colonoscopy
Cancer screening
Louisville University Health
Genetic mutations
Smoking

More Telugu News