Chandrababu Naidu: వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష .. రైతాంగానికి కీలక సూచనలు

Chandrababu Naidu Reviews Agriculture and Allied Sectors in AP
  • పూర్వోదయ స్కీంను సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు
  • ఏపీలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రొత్సహించాలని సూచన
  • సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పాలన్న సీఎం
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పూర్వోదయ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పూర్వోదయ మిషన్‌లో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించుకోవాల్సిన ప్రణాళికలపై సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ఉద్యాన పంటలు, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు వాటిపై ఆధారపడిన వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చూడాలన్నారు. ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించాలని, అలాగే రాష్ట్రాభివృద్ధికి మరింతగా తోడ్పడేలా ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు వేయడం ద్వారా కూడా ఆదాయం రెట్టింపయ్యేలా చూడాలన్నారు.

అలాగే జాతీయంగా, అంతర్జాతీయంగా ఎక్కువ డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై అధ్యయనం చేసి ఆ మేరకు ఎగుమతులకు అనుగుణంగా ఉత్పత్తి చేపట్టాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి పంటలకు డిమాండ్ ఉంటుందో అంచనా వేసి దానికి అనుగుణంగా ఆ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. మన వాతావరణంలో ఏయే పంటలు పండుతాయో అధ్యయనం చేస్తే మన వాతావరణంలో పండించగలిగే అన్ని రకాల పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం వివరించారు.

రైతులను పరిశ్రమలకు అనుసంధానం చేయాలి

ప్రతి రైతును పరిశ్రమలకు అనుసంధానం చేసేలా ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలా చేయగలిగితే రైతులు ఉత్పత్తి చేసిన పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పారు. ఈ మేరకు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎఫ్పీఓలకు కేంద్రం ఆర్థికంగా అండగా నిలుస్తోందని చంద్రబాబు వివరించారు. ఉద్యాన రంగ రైతులకు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అందరికీ కలిసి వచ్చేలా ఓ వర్క్ షాప్ నిర్వహించాలని ఆదేశించారు. అన్ని రకాల ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబులిటీ వచ్చేలా చూడాలని చెప్పారు.

అలాగే ఆక్వా ఉత్పత్తుల సాగు రెట్టింపయ్యేలా చూడాలన్నారు. ఆక్వా కల్చర్ యూనివర్శిటీ ఏర్పాటుపై ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న లాజిస్టిక్స్ ను కూడా పూర్తిగా వినియోగించుకోగలిగితే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చునని, ప్రతి రైతుసేవా కేంద్రం పరిధిలో 2 వేల హెక్టార్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు ఉన్నాయని, ఆ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఏయే పంటలు ఉన్నాయనే విషయాన్ని విశ్లేషించి రైతులకు అన్ని రకాలుగా అవగాహన కల్పించేలా రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బందిని వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

క్లస్టర్ ఆధారంగా పశువుల కోసం సామూహిక షెడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పశువుల కోసం ఏర్పాటు చేసే సామూహిక షెడ్ల నిర్వహణ, పశు పోషణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. పశువుల షెడ్ల ఏర్పాటుతో పాటు పాల ఉత్పత్తి యూనిట్లు, చిల్లింగ్ యూనిట్లు, దాణా బ్యాంకులు, బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. పశువుల సంఖ్యను పెంచడం, పాల ఉత్పత్తి పెరిగేలా చూడడం, పశు వ్యాధులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఆ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఉండేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Agriculture
Horticulture
Micro Irrigation
Fisheries
Aqua Culture
Food Processing
Rythu Seva Kendram

More Telugu News