Satish Kumar: కదిరి మర్డర్ మిస్టరీ వీడింది!

Kadiri Murder Mystery solved by Satish Kumar
  • దృశ్యం సినిమా తరహాలో వ్యక్తి హత్యకు దారి తీసిన పరిస్థితి
  • ఓ మహిళ స్నానం చేస్తుండగాా, వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన హతుడు అమర్నాథ్
  • స్నేహితులతో కలిసి అమర్నాథ్‌ను హత్య చేసిన మహిళ భర్త దాదా పీర్
  • నూతన ఎస్పీ సతీశ్ కుమార్ ప్రత్యేక చొరవతో వీడిన మర్డర్ కేసు మిస్టరీ
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో రెండేళ్ల క్రితం జరిగిన ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. దృశ్యం సినిమా తరహాలో జరిగిన ఈ హత్య కేసును నల్లచెరువు పోలీసులు ఛేదించడం సంచలనంగా మారింది. నేరం చేసిన వాడు ఎన్నాళ్లకైనా దొరికిపోతాడు అనేందుకు ఇది ఉదాహరణగా నిలుస్తుంది.

చెర్లోపల్లి జలాశయంలో దొరికిన మృతదేహం

2023లో నల్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్లోపల్లి జలాశయంలో గుర్తుతెలియని మృతదేహం పోలీసులకు లభ్యమైంది. విచారణలో అది అల్లుగుండుకు చెందిన యువకుడు అమర్నాథ్‌గా గుర్తించారు. మొదట ఇది ఆత్మహత్యగా భావించినా, స్పష్టత లేకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

కేసును మళ్లీ తెరిచిన ఎస్పీ సతీష్ కుమార్


రెండు సంవత్సరాల పాటు ఎలాంటి పురోగతి లేకుండా ఉన్న ఈ కేసుపై శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సతీశ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసును ఛేదించాలని నిశ్చయించిన ఎస్పీ, విచారణను మళ్లీ ప్రారంభించాలని నల్లచెరువు పోలీసులకు ఆదేశించారు.

గ్రామస్తుల సమాచారం కీలకం

విచారణలో భాగంగా మృతుడు అమర్నాథ్‌కు గ్రామంలో ఎవరైనా శత్రువులున్నారా అన్న కోణంలో స్థానికులను పోలీసులు ప్రశ్నించగా, ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. బాత్ రూమ్‌లో స్నానం చేస్తున్న ఓ మహిళను అమర్నాథ్ రహస్యంగా వీడియో తీశాడని, ఆ వీడియోను చూపించి ఆమెను లైంగికంగా బలవంతపెట్టేందుకు బ్లాక్‌మెయిల్ చేశాడని గ్రామస్తులు వెల్లడించారు.

దీంతో పోలీసులు ఆ మహిళ భర్త దాదా పీర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భార్య స్నానం చేస్తున్న వీడియోను చూపి బ్లాక్ మెయిల్ చేస్తున్న అమర్నాథ్ ను హత్య చేయాలని దాదా పీర్ నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో తన స్నేహితులు సాదిక్, యాసిన్‌లతో కలిసి అమర్నాథ్‌ను హత్య చేయాలని దాదా పీర్ ప్లాన్ చేశాడు. మద్యం తాగుదామని చెప్పి అమర్నాథ్‌ను కదిరి రూరల్‌లోని బాలప్పగారిపల్లికి తీసుకెళ్లారు. అక్కడ పూటుగా మద్యం తాగించిన తర్వాత బండరాళ్లతో అతని తలపై కొట్టి హత్య చేశారు. అనంతరం శరీరానికి బండరాళ్లు కట్టి చెర్లోపల్లి జలాశయంలో పడేశారు.

ముగ్గురు అరెస్ట్

అమర్నాథ్ మృతదేహం దొరికినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు ఇంతకాలం పెండింగ్‌లోనే ఉంది. అయితే గ్రామస్థులు ఇచ్చిన చిన్న సమాచారం ఆధారంగా పోలీసులు నిందితులపై నిఘా పెట్టి దర్యాప్తును కొనసాగించారు. చివరికి దాదా పీర్ విచారణలో అమర్నాథ్ హత్యను ఒప్పుకున్నాడు. దీంతో అమర్నాథ్ హత్య కేసులో దాదా పీర్‌ను అతనికి సహకరించిన సాదిక్, యాసిన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కదిరి మర్డర్ కేసు మిస్టరీ వీడిపోయింది. 
Satish Kumar
Kadiri murder case
Sri Sathya Sai district
Cherlopalli reservoir
Amarnath murder
Dada Peer arrest
crime news
Andhra Pradesh police
blackmail murder
Kadiri rural

More Telugu News