China K Visa: చైనా కొత్త వీసా ఆఫర్‌పై ఆ దేశ యువత ఆందోళన!

China K Visa Program Sparks Concerns Amidst Unemployment
  • హెచ్-1బీ వీసాల రుసుము పెంచిన ట్రంప్ ప్రభుత్వం
  • ప్రతిభావంతులను ఆహ్వానించేందుకు కే వీసాను ప్రకటించిన చైనా
  • వీసాలు పొందడానికి ఏ ఉద్యోగి లేదా సంస్థ ఆహ్వానం అవసరం లేకుండా కె వీసా
  • దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే వీసా ప్రకటన ఏమిటంటూ యువత ఆగ్రహం
ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు చైనా సరికొత్త వీసా ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. సైన్స్, టెక్నాలజీ రంగాలకు చెందిన నిపుణులను తమ దేశానికి ఆహ్వానించే లక్ష్యంతో 'కే వీసా'ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, చైనాలో నిరుద్యోగిత రేటు అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ కొత్త వీసా ప్రకటనపై సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వృత్తి నిపుణుల కోసం జారీ చేసే హెచ్-1బీ వీసాల రుసుమును అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం భారీగా పెంచిన తరుణంలో, నిపుణులను ఆకర్షించేందుకు చైనా 'కే వీసా' ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి రావాల్సి ఉండగా, వరుస సెలవుల కారణంగా ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఈ కొత్త వీసా ప్రోగ్రాం ప్రారంభం కాకముందే స్థానిక యువత నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనా కొత్త 'కే వీసా'లపై వచ్చిన వారు విద్యా, సాంస్కృతిక, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీసాలు పొందడానికి ఉద్యోగి లేదా సంస్థ నుంచి ఆహ్వానం అవసరం లేదు.

గత రెండేళ్లలో చైనాలో నిరుద్యోగిత రేటు గణనీయంగా పెరిగింది. నిరుద్యోగిత రేటు 19 శాతంగా ఉండగా, ప్రతి సంవత్సరం 1.2 కోట్ల మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారు. దీంతో స్థానికులకు ఉద్యోగాలు పొందడం కష్టతరంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో, స్థానికులకు కాకుండా విదేశీ నిపుణులకు అనుకూలంగా కొత్త వీసా ప్రోగ్రామ్‌ను ప్రకటించడం సరికాదని యువత అభిప్రాయపడుతోంది.

వీసాల జారీలో కంపెనీల స్పాన్సర్‌షిప్ లేకపోవడం వల్ల మోసాలకు ఆస్కారం ఉంటుందని, నైపుణ్యం లేని దరఖాస్తుదారులు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసా ఏజెన్సీలు విదేశీ విద్యార్థులకు వీసాలు జారీ చేసేందుకు పోటీ పడతాయని, అప్పుడు విద్యార్హతలను గుర్తించడం కష్టమవుతుందని వారు పేర్కొంటున్నారు.
China K Visa
China
K Visa
H-1B Visa
US H-1B Visa
China unemployment
China jobs

More Telugu News