TSRTC: హైదరాబాద్ నగరంలో పెరగనున్న బస్సు ఛార్జీలు... ఎందుకంటే?

TSRTC Announces Bus Fare Hike in Telangana Again
  • ఆర్డినరీ బస్సుల్లో 3వ స్టాప్ వరకు రూ. 5 పెంపు
  • 4 స్టాపుల తర్వాత ఛార్జీ రూ. 10 పెంపు
  • డీలక్స్, ఏసీ బస్సుల్లో మొదటి స్టాప్ వరకు రూ. 5, రెండో స్టాప్ నుంచి రూ.10 పెంచాలని నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) బస్సు ఛార్జీలను సవరించనుంది. భాగ్యనగరం పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్డినరీ బస్సుల్లో మొదటి స్టాప్ నుంచి మూడు స్టాపుల వరకు ఛార్జీని రూ. 5, నాలుగు స్టాపుల తర్వాత ఛార్జీని రూ. 10 వరకు పెంచనున్నారు.

మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టాప్ వరకు రూ. 5, రెండో స్టాప్ నుంచి రూ.10 వరకు ఛార్జీలను పెంచాలని సంస్థ నిర్ణయించింది. పెరిగిన ధరలు అక్టోబర్ 6వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం విదితమే.

హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల డీజిల్ బస్సుల స్థానంలో రాబోయే రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా  ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం మరో పది డిపోలను అదనంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 10 ఛార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను సవరించాల్సి వస్తోందని, ఇందుకు ప్రజలు సహకరించాలని టీజీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
TSRTC
Telangana RTC
Bus fare hike
Telangana bus charges
Hyderabad city buses
RTC charges increase

More Telugu News