Chandrababu Naidu: ఆ దుష్టులు మళ్లీ వస్తే అన్నీ పీకేస్తారు: సీఎం చంద్రబాబు

Chandrababu Warns Against Destructive Forces Returning to Power
  • 2.9 లక్షల మంది డ్రైవర్ల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ చేసిన కూటమి ప్రభుత్వం
  • ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహాలో ప్రత్యేక యాప్ తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటన
  • డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ
  • గత ప్రభుత్వ హయాంలో రోడ్లు ధ్వంసం అయ్యాయని, తాము బాగుచేశామని వెల్లడి
  • పేదల సంక్షేమ పథకాల్లోనూ డబ్బులు దోచుకున్నారని తీవ్ర విమర్శలు
రాష్ట్రంలో గత పాలకులు సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించామని, అలాంటి దుష్టులు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు మిగిలినవి కూడా పీకేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి వారి పాలన రాష్ట్రానికి ఇక వద్దని, ప్రజలే వారిని తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం జరిగిన 'ఆటోడ్రైవర్ల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించారు. 

పేదల సంక్షేమ పథకాల్లోనూ డబ్బులు దోచుకున్న వారు రాజకీయాలకు పనికిరారని, ప్రజలకు చెడు జరగకుండా కాపాడుకోవడమే నిజమైన పండుగని అన్నారు. అవే మనకు ఈ దసరా, దీపావళి పండుగల పాఠాలు. మనకు ఇక ఈ వైకుంఠపాళి వద్దు అని పేర్కొన్నారు. మీకు మంచి చేసిన కూటమి ప్రభుత్వం గురించి పది మందికి చెప్పండి అని సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. 'ఆటోడ్రైవర్ల సేవలో' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది అర్హులైన డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి రూ.436 కోట్లను నేరుగా జమ చేసినట్లు ప్రకటించారు. డబ్బులు ఖాతాలో పడ్డాయో లేదో చూసుకోవాలని ఆయన కోరగా, ఆటోడ్రైవర్లు తమ సెల్‌ఫోన్లలో వచ్చిన బ్యాంకు మెసేజ్‌లను చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఏ ఒక్కరికైనా సాంకేతిక కారణాలతో డబ్బు జమ కాకపోతే, అర్హతలను పరిశీలించి వెంటనే జమ చేస్తామని హామీ ఇచ్చారు.

ఉబర్ తరహా యాప్.. సంక్షేమ బోర్డు

ఆటో డ్రైవర్ల కష్టాలను తీర్చేందుకు టెక్నాలజీని వినియోగిస్తామని చంద్రబాబు తెలిపారు. వారి కోసం ఉబర్ తరహాలో ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించి, బుకింగ్‌లు సులభంగా లభించేలా చూస్తామన్నారు. దీనికోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఆటో స్టాండుల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. డ్రైవర్ల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు 'ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు'ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. క్రమశిక్షణతో మెలిగి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి సహకరించాలని డ్రైవర్లకు సూచించారు.

గత పాలనపై విమర్శలు.. కూటమి పాలనపై ప్రశంసలు

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, పాలన పూర్తిగా స్తంభించిపోయిందని చంద్రబాబు విమర్శించారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారి, డ్రైవర్ల సంపాదనంతా రిపేర్లకే పోయేదని గుర్తుచేశారు. అన్యాయంగా జరిమానాలు వేసి వేధించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 16 నెలల్లోనే 23 వేల కిలోమీటర్ల రోడ్లను మరమ్మతులు చేసి, గుంతలు లేని రోడ్లను అందించామన్నారు. 

పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కూడా గత పాలకులు మూసివేశారని, తాము వాటిని పునఃప్రారంభించి రూ.5కే నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో దశలవారీగా అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, ఇందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రం, కేంద్రంలో అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Auto Drivers
Welfare Schemes
TDP
Janasena
BJP
Uber App
Electric Vehicles
Anna Canteens

More Telugu News