Ambati Rambabu: అమెరికాలో అంబటి కూతురి పెళ్లి.. కారణం ఆయనేనంటూ చమత్కారం!

Ambati Rambabu Daughters Wedding in America Trump is the Reason
  • ఇల్లినాయిస్‌ మహాలక్ష్మీ ఆలయంలో హిందూ సంప్రదాయంలో పెళ్లి
  • కుమార్తె శ్రీజ, అల్లుడు హర్ష వివరాలు వెల్లడించిన అంబటి
  • ట్రంప్ వల్లే అమెరికాలో పెళ్లి చేయాల్సి వచ్చిందంటూ చలోక్తి
  • వేడుకలో నవ్వులు పూయించిన అంబటి సరదా వ్యాఖ్యలు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె డాక్టర్ శ్రీజ వివాహం అమెరికాలో ఘనంగా జరిగింది. ఇల్లినాయిస్‌లోని మహాలక్ష్మీ ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ వేడుకను నిరాడంబరంగా, అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించారు.

అంబటి రాంబాబు, ఆయన అర్ధాంగితో పాటు ఇరు కుటుంబాల సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులు డాక్టర్ శ్రీజ, హర్షలను అంబటి రాంబాబు అక్కడున్న వారికి పరిచయం చేశారు. తన కుమార్తె శ్రీజ అమెరికాలో ఎండోక్రైనాలజిస్ట్‌గా పనిచేస్తుండగా, అల్లుడు హర్ష సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని, ఆయన స్వస్థలం తణుకు అని వెల్లడించారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు చేసిన ఓ సరదా వ్యాఖ్య అక్కడున్న వారిని నవ్వించింది. నిజానికి ఈ పెళ్లిని ఏపీలోనే చేయాలనుకున్నామని, కానీ ట్రంప్ కారణంగా ఇక్కడే చేయాల్సి వచ్చిందని ఆయన చమత్కరించారు. పెళ్లి కోసం ఇండియాకు వస్తే, ట్రంప్ మళ్లీ వారిని అమెరికాకు తిరిగి రానివ్వరేమోననే ఉద్దేశంతోనే ఇక్కడే పెళ్లి జరిపించామని సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ambati Rambabu
Ambati Rambabu daughter
Sreeja
America wedding
Trump
YSRCP
Illinois
Mahalakshmi Temple
Telugu wedding
Harsha

More Telugu News