Nitish Kumar Reddy: అహ్మదాబాద్ టెస్ట్.. క‌ళ్లు చెదిరే క్యాచ్ ప‌ట్టిన నితీశ్ కుమార్ రెడ్డి.. ఇదిగో వీడియో!

Nitish Kumar Reddy Stunning Catch in Ahmedabad Test
  • స్టన్నింగ్ క్యాచ్‌తో ఓపెనర్ చంద్రపాల్‌ను పెవిలియన్ పంపిన నితీశ్
  • కాసేపటికే మరో ఓపెనర్‌ను ఔట్ చేసిన రవీంద్ర జడేజా
  • 46 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్
  • తొలి టెస్టుపై పట్టు బిగించిన టీమిండియా
  • విజయానికి ఇంకా 5 వికెట్ల దూరంలో భారత్
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్క్వేర్ లెగ్ ఫీల్డింగ్‌లో అతను అందుకున్న  క‌ళ్లు చెదిరే క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ క్యాచ్‌తో వెస్టిండీస్ ఓపెనింగ్ భాగస్వామ్యం విడిపోవడమే కాకుండా, విండీస్‌ జట్టు కష్టాల్లో పడింది.

వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో ఓపెనర్ టగెనరైన్ చంద్రపాల్ బంతిని బలంగా లెగ్ సైడ్ దిశగా బాదాడు. బంతి వేగంగా బౌండరీకి వెళ్తున్నట్లు కనిపించింది. అయితే, స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నితీశ్ కుమార్ రెడ్డి మెరుపు వేగంతో గాల్లోకి ఎగిరి రెండు చేతులతో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో 23 బంతుల్లో 8 పరుగులు చేసిన చంద్రపాల్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. నితీశ్ ప‌ట్టిన క్యాచ్ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.

ఈ కీలక బ్రేక్‌త్రూ లభించిన కొద్దిసేపటికే టీమిండియా మరో వికెట్ పడగొట్టింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మరో ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ కూడా ఔటయ్యాడు. ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సాయి సుదర్శన్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 12 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన విండీస్, 24 పరుగులకే రెండో వికెట్‌ను పారేసుకుంది. ఆ త‌ర్వాత కూడా కరీబియన్ జట్టు వికెట్ల ప‌త‌నం కొన‌సాగింది. 46 ప‌రుగుల‌కే కీల‌క‌మైన ఐదు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. భోజ‌న విరామానికి విండీస్ 27 ఓవ‌ర‌ల్లో 5 వికెట్లకు 66 ర‌న్స్ చేసింది. ఇంకా భార‌త్ కంటే 220 ప‌రుగుల వెనుకంజలో ఉంది. 220 ర‌న్స్ లోపు టీమిండియా మ‌రో ఐదు వికెట్లు తీస్తే విజ‌యం సాధిస్తుంది. 
Nitish Kumar Reddy
India vs West Indies
Ahmedabad Test
Nitish Reddy Catch
Cricket Catch Video
Sai Sudharsan
Ravindra Jadeja
Tagenarine Chanderpaul
John Campbell
India Cricket

More Telugu News