Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక ఎన్నికలు.. పోటీకి అనర్హులు వీరే!

Telangana Local Body Elections Who is Ineligible to Contest
  • తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా
  • ఈ నెల‌ 9 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణ
  • వెంటనే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
  • పోటీకి అనర్హుల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
  • ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేయడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో ఎవరు నిలబడొచ్చు, ఎవరు నిలబడకూడదనే దానిపై ఈసీ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం, ఈ నెల‌ 9వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియను నవంబర్ నెలలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నామినేషన్ల పరిశీలన నాటికి అభ్యర్థికి కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. అంతేకాకుండా, వారు పోటీ చేస్తున్న వార్డు లేదా గ్రామ పంచాయతీ పరిధిలో ఓటరుగా నమోదై ఉండటం తప్పనిసరి. సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

వీరంతా పోటీకి అనర్హులు 
పలువురిని పోటీకి అనర్హులుగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం జాబితా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు లేదా ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది పోటీ చేయడానికి వీల్లేదు. వీరితో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సేవకులు కూడా అనర్హులని స్పష్టం చేసింది. పార్లమెంటు లేదా అసెంబ్లీ చట్టాల ద్వారా ఏర్పడిన సంస్థల్లో పదవులు అనుభ‌విస్తున్న వారు కూడా ఎన్నికల బరిలో నిలబడరాదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, అక్రమ నగదు, మద్యం రవాణాను అడ్డుకునేందుకు అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
Telangana Local Body Elections
Telangana Elections
Local Body Elections
Telangana State Election Commission
Election Code
Voter Eligibility
Disqualified Candidates
Mptc Zptc
Sarpanch Elections
Ward Member Elections

More Telugu News