Telangana Crimes: నేరాల్లో తెలంగాణ టాప్.. ఎన్‌సీఆర్‌బీ నివేదికలో సంచలన విషయాలు!

NCRB Report Telangana Ranks High in Crimes Against Women Food Adulteration
  • మహిళలపై నేరాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ
  • జాతీయ సగటు కన్నా మూడింతలు అధికంగా క్రైమ్ రేట్ నమోదు
  • ఆహార కల్తీ కేసుల విషయంలో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం
  • భర్త, బంధువుల నుంచే మహిళలకు అత్యధికంగా వేధింపులు
  • రాష్ట్రంలో ఆందోళనకరంగా పెరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య
  • కుటుంబ సమస్యలే బలవన్మరణాలకు ప్రధాన కారణంగా వెల్లడి
తెలంగాణలో నేరాల తీవ్రతపై జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన 2023 నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాయిత్యాల్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆహార కల్తీ కేసుల్లో అయితే దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం గమనార్హం.

ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం తెలంగాణలో మహిళలపై నేరాల రేటు జాతీయ సగటు (66.2) కన్నా ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా, ప్రతి లక్ష మందికి 189.6గా నమోదైంది. 2023లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై 23,679 నేరాలు జరిగినట్టు తేలింది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కేసుల్లో అత్యధికంగా 10,518 కేసులు భర్త, వారి బంధువుల చేతిలో వేధింపులకు గురైనవే కావడం గమనార్హం. 

మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో 5,024 దాడులు, కిడ్నాప్ కేసులు 2,152 నమోదయ్యాయి. పోక్సో చట్టం కింద నమోదైన 3,128 కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 508 కేసులుండటం నగరంలో చిన్నారుల భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అయితే, నేరాల నమోదుతో పాటు చార్జిషీట్ దాఖలు చేసే రేటు 88.1 శాతంగా ఉండటం కొంత సానుకూల అంశం.

మరోవైపు, రాష్ట్రంలో ఆత్మహత్యల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలో పెరిగింది. 2023లో 10,580 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రతి లక్ష జనాభాకు ఆత్మహత్యల రేటు 27.7గా ఉంది. ఇది జాతీయ సగటు 12.3 కంటే రెట్టింపు ఎక్కువ. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా కుటుంబ సమస్యలే (44.2 శాతం) ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఆత్మహత్య చేసుకున్న వారిలో రోజువారీ కూలీలు, స్వయం ఉపాధి పొందుతున్నవారే ఎక్కువగా ఉన్నారు.

ఆహార భద్రత విషయంలో తెలంగాణ పనితీరు మరింత దిగజారింది. ఆహార కల్తీ కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 382 ఆహార, ఔషధ కల్తీ కేసులు నమోదు కాగా, అందులో 218 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అయితే, ఈ కేసుల్లో ఒక్కటి కూడా ఆహార కల్తీ నిరోధక చట్టం కింద నమోదు కాకపోవడం చట్టాల అమలు తీరును ప్రశ్నిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీలపై దాడుల విషయంలోనూ తెలంగాణ దేశంలో ఐదో స్థానంలో ఉన్నట్టు ఎన్‌సీఆర్‌బీ నివేదిక తేల్చి చెప్పింది.
Telangana Crimes
NCRB Report 2023
Crime Rate Telangana
Women Safety Telangana
Food Adulteration Cases
Suicide Rate Telangana
Hyderabad Crime
Crimes Against Women India

More Telugu News