Cough Syrup: పిల్లలకు దగ్గుమందు వాడకంపై కేంద్రం మార్గదర్శకాలు

Cough Syrup Guidelines Issued by Central Government for Children
  • మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో 11 మంది చిన్నారుల మృతి
  • రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసిన డీజీహెచ్ఎస్
  • చిన్నారులకు దగ్గు సిరప్‌లు సిఫార్సు చేయవద్దన్న డీజీహెచ్ఎస్  
రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు, జలుబు మందులు (సిరప్‌లు) ఇవ్వొద్దని కేంద్రం స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో దగ్గు మందుల వాడకం వల్ల 11 మంది చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) నిన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు జారీ చేసింది.

చిన్నారులకు ఒటీసీ దగ్గు మందులపై నిషేధ సూచనలు:

ఓవర్‌ ది కౌంటర్ (OTC) దగ్గు మందులను తల్లిదండ్రులు తమంతట తాముగా పిల్లలకు ఇవ్వరాదు.
ఐదేళ్లలోపు పిల్లలకు సాధ్యమైనంత వరకు దగ్గు సిరప్‌లు సిఫారసు చేయరాదు.
సిరప్‌ అవసరమైతే, అది తగిన మోతాదు, నిర్దిష్ట కాలం, వైద్యుల సూచనలతోనే ఇవ్వాలి.

డీజీహెచ్‌ఎస్ తెలిపిన ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో 9 మంది చిన్నారులు దగ్గు సిరప్ తాగిన తర్వాత కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. కనీసం 5 మంది కోల్ డ్రెఫ్, ఒకరు నెక్స్‌ట్రో అనే సిరప్ వాడినట్టు గుర్తించారు. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో మరో మరణం కూడా దగ్గు మందుల వాడకమే కారణమని అధికారులు భావిస్తున్నారు.

కల్తీ లేదు – పరీక్షల నివేదిక

ఈ ఘటనలపై దర్యాప్తు చేసిన ఆరోగ్యశాఖ, సిరప్‌లలో కల్తీ లేదని స్పష్టం చేసింది. కిడ్నీలకు హానికరమైన డైఇథలీన్ గ్లైకాల్ (డీఈజీ) లేదా ఇథిలీన్ గ్లైకాల్ (ఈజీ) వంటి హానికర రసాయనాలు ఈ మందుల్లో లేవని నమూనాల పరీక్షలో తేలింది. దీంతో ప్రజలలో నెలకొన్న అనుమానాలకు నివృత్తి జరిగింది.

పిల్లలకు దగ్గు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని, ఒటీసీ దగ్గు మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదని కేంద్రం తెలిపింది. తేనె, తులసి, గోరువెచ్చని నీరు వంటివి కూడా వైద్యుల సలహాతో మాత్రమే వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. దగ్గు మందులను స్నేహితుల సలహా, సోషల్ మీడియా ఆధారంగా ఇవ్వకూడదని తెలిపింది. 
Cough Syrup
Children cough syrup
DGHS
Central Government Guidelines
Kids health
Cold and cough medicine
India health advisory
Diethylene glycol
Ethylene glycol
OTC medicines

More Telugu News