Chandrababu Naidu: అరకు కాఫీకి ప్రతిష్ఠాత్మక అవార్డు... జీసీసీకి సీఎం చంద్రబాబు అభినందన

Chandrababu Naidu Praises GCC for National Award for Araku Coffee
  • అరకు కాఫీకి ప్రతిష్టాత్మక 'బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్' అవార్డు
  • సీఎంను కలిసి అవార్డు చూపిన మంత్రి సంధ్యారాణి, జీసీసీ ఎండీ
  • అరకు కాఫీ గిరిజనుల జీవితాల్లో మార్పు తెచ్చిందన్న ముఖ్యమంత్రి
  • టాటాతో ఒప్పందం.. త్వరలో ఆర్గానిక్ సాల్యూబుల్ కాఫీ ఉత్పత్తి
  • మాకవరపాలెంలో భారీ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు
అరకు కాఫీ ద్వారా జాతీయ స్థాయిలో బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్ అవార్డు దక్కించుకున్న గిరిజన సహకార సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అరకు వ్యాలీకి కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్సఫర్మేషన్ విభాగంలో అవార్డు దక్కడంపై గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జీసీసీ ఎండీ కల్పన కుమారిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సీఎం చంద్రబాబును మంత్రి సంధ్యారాణి, ఎండీ కల్పన కుమారి నేడు సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా బిజినెస్ లైన్ నుంచి స్వీకరించిన అవార్డును, ప్రశంసా పత్రాన్ని సీఎం పరిశీలించారు. 

జీఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్ గా మారిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఏజెన్సీ ప్రాంతంలో సేంద్రీయ విధానంలో సాగు అవుతున్న అరకు కాఫీ స్వచ్ఛత, సువానలతో పాటు... ప్రత్యేక రుచిని కలిగి ఉందన్నారు. ఈ విశిష్టత కారణంగా అరకు కాఫీకి మంచి బ్రాండ్ అనే పేరు వచ్చిందని సీఎం చెప్పారు. కాఫీ సాగు ద్వారా అరకులోని గిరిజనుల జీవన శైలిలో మార్పు వచ్చిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 

ఇటీవల జీసీసీ-టాటా కన్స్యూమర్ ప్రొడెక్ట్స్ లిమిటెడ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంతో దేశంలో తొలిసారిగా ఆర్గానిక్ సాల్యూబుల్ కాఫీ ఉత్పత్తి కానుందని మంత్రి సంధ్యారాణి సీఎంకు వివరించారు. నర్శిపట్నం సమీపంలోని మాకవరపాలెం గ్రామంలో ఆధునిక సాంకేతికతతో కూడిన ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తిగా బీన్ టు కప్ మోడల్ అభివృద్ధి కానుందని... తద్వారా అరకు కాఫీకి మరింత మార్కెట్ వస్తుందని మంత్రి సంధ్యారాణి వివరించారు.
Chandrababu Naidu
Araku coffee
GCC
Gummadi Sandhyarani
Araku Valley
coffee award
tribal cooperative
organic coffee
Andhra Pradesh

More Telugu News