Ranadhir Jaiswal: పీవోకేలో పాకిస్థాన్ దారుణం.. తీవ్రంగా స్పందించిన భారత్

Ranadhir Jaiswal reacts strongly to Pakistans atrocities in POK
  • పీవోకేలో పాకిస్థాన్ భయంకర మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందన్న భారత్
  • పీవోకేలో జరిగే అరాచకానికి పాకిస్థాన్‌ను జవాబుదారీగా చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు
  • పాక్ బలగాల అరాచకత్వం తమ దృష్టికి వచ్చిందని ఆవేదన
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో పాకిస్థాన్ అణిచివేత విధానంపై భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. పీవోకేలో నెలకొన్న అశాంతి, నిరసనల నేపథ్యంలో, ఆ ప్రాంతంలో పాకిస్థాన్ భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని, ఆ దేశాన్ని జవాబుదారీగా చేయాలని భారతదేశం అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాకిస్థాన్ అణిచివేత విధానమే పీవోకేలో అశాంతికి దారితీసిందని అన్నారు. పీవోకేలోని పలు ప్రాంతాల్లో జరుగుతోన్న నిరసనలు, అమాయక ప్రజలపై పాక్ బలగాల అరాచకత్వం తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

పాక్ అణిచివేత ధోరణితో పాటు ఆ ప్రాంతంలో వనరులను కొల్లగొట్టడమే ఈ అశాంతికి ప్రధాన కారణమని తాము విశ్వసిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, సెప్టెంబర్ 26 నుంచి అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నేతృత్వంలో కొన్నిరోజులుగా పీవోకేలో నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం తమను దశాబ్దాలుగా రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్లకు పైగా పీవోకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని వారు వాపోయారు. పీవోకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ 38 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వం ముందు ఉంచారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండటంతో పాక్ ప్రభుత్వం ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భారీగా బలగాలను మోహరించింది. ఈ క్రమంలో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 150 మంది వరకు గాయపడ్డారు.
Ranadhir Jaiswal
POK
Pakistan Occupied Kashmir
India
human rights violations
Pakistani forces

More Telugu News